అత్యంత ప్రేక్షకాదరణ పొందిన వెబ్ సిరీస్‌ల్లో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఒకటి. 2019లో ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో సీజన్ 1 విడుదలైంది. ఈ వెబ్ సిరీస్ లో మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి తదితరులు కీలక పాత్రధారులుగా ఉన్నారు. రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్‌కి సీక్వెల్‌గా ది ఫ్యామిలీ మ్యాన్ 2 తెరకెక్కించగా, ఇందులో సమంత నెగెటివ్ రోల్ పోషించి అలరించింది.
ఈ వెబ్ సిరీస్ ను ముందు హిందీలో మాత్రమే విడుదల చేశారు. తర్వాత తెలుగు, తమిళ భాషలలో విడుదల చేశారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌కి మనోజ్ బాజ్‌పాయ్, సమంతకు అవార్డులు కూడా దక్కిన విషయం తెలిసిందే. అయితే ‘ఫ్యామిలీ మ్యాన్’ టీం ఇప్పుడు మూడో సీజన్‌ని కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుందట.ఇందులోటాలీవుడ్ యువ హీరో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది.
సత్య, ఆర్జావీ రాజ్ జంటగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రామ్ ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కేఎస్ శినీష్, సందీప్ కిషన్ నిర్మించిన ‘వివాహ భోజనంబు’ సినిమా ఈ నెల 27 నుంచి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మాట్లాడిన సందీప్.. నటుడిగా 12 ఏళ్లుగా కష్టపడుతున్నాను. ఆ కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడు వస్తోంది. మంచి ప్రాజెక్ట్స్ కుదురుతున్నాయి. ‘ది ఫ్యామిలీమ్యాన్ 3’ సిరీస్‌లో నటించనున్నాను అని పేర్కొన్నాడు. మరి సమంత సిరీస్ 3లో నటిస్తుందో లేదో తెలియాల్సి ఉంది.