సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అనగనగా ఒక రౌడీ’. మను యజ్ఞ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సుమంత్ వాల్తేరు శీను అనే వైజాగ్ ప్రాంతానికి చెందిన రౌడీగా కనిపించబోతున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు సుమంత్ ట్విట్టర్ ద్వారా శనివారం ప్రకటించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను ఆయన ట్విట్టర్లో పోస్ట్చేశారు. ఇందులో లుంగీ ధరించి, మెలితిరిగిన మీసకట్టుతో వినూత్నంగా కనిపిస్తున్నారాయన. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా మాస్ పంథాలో సుమంత్ పాత్రచిత్రణ సాగుతుందని సమాచారం. ఐమా నాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఏక్దోతీన్ ప్రొడక్షన్స్ పతాకంపై గార్లపాటి రమేష్, డా॥ టీఎస్ వినీత్భట్ నిర్మిస్తున్నారు.