గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Oct 18, 2020 , 01:05:17

ఇచట కథలు ఇవ్వబడును

ఇచట కథలు ఇవ్వబడును

దర్శకుల సృజనాత్మకతకు ఎలాంటి పరిధులు ఉండవు. నిత్యం కొత్త కథల్ని తెరపై తీసుకురావాలని తపిస్తుంటారు. తమ అభిరుచులు ప్రతిబింబించే కథల్ని, హృదయాన్ని తడిమిన వ్యథల్ని, స్ఫూర్తివంతమైన గాథల్ని వెండితెరపై దృశ్యమానం చేయాలని కలలు కంటుంటారు. అయితే కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌గా అభివర్ణించే దర్శకులకు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. వృత్తిపరమైన సమయాభావం వల్ల వారు కోరుకున్న కథలన్నింటిని దృశ్యరూపం చేయడం సాధ్యం కాదు. ఇలాంటి తరుణంలో కొందరు దర్శకులు కథారచయితలుగా అవతారమెత్తుతున్నారు. ఓవైపు తమ దర్శకత్వంలోని సినిమా వ్యవహారాలతో బిజీగా ఉంటూనే మరోవైపు ఇతర దర్శకుల సినిమాకు కథల్ని అందిస్తూ తమ సృజనాత్మక      తృష్ణను తీర్చుకుంటున్నారు.

సుకుమార్‌ ‘9ప్రేమకథలు’

ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ వెండితెరపై సృజించిన ప్రేమకథా చిత్రాలన్నీ విలక్షణంగా కనిపిస్తాయి. ప్రణయబంధంలోని గాఢమైన భావోద్వేగాల్ని ఎవరూ తరచి చూడని కోణంలో ఆవిష్కరించడం ఆయన ప్రత్యేకతగా చెబుతారు. ముఖ్యంగా ప్రేమలోని కన్ఫ్యూజన్‌ను, ప్రేమికుల మధ్య ఇగో సమస్యల్ని తనదైన ఫిలాసఫికల్‌ పంథాలో సినిమాల్లో ఆవిష్కరిస్తుంటారాయన. తాజాగా సుకుమార్‌ ‘9ప్రేమకథలు’ పేరుతో ఓ వెబ్‌సిరీస్‌కు కథారచన చేస్తున్నారు. ప్రేమలోని భిన్న పార్శాల్ని స్పృశిస్తూ ఈ కథల్ని రాసుకున్నారట సుకుమార్‌. ఈ లవ్‌ ఆంథాలజీకి సుకుమార్‌ శిష్యగణం దర్శకత్వ బాధ్యతలు తీసుకోబోతున్నారని తెలిసింది. ఒక్కో కథకు ఒక్కరుగా మొత్తం తొమ్మిది మంది దర్శకులు పరిచయం కాబోతున్నారని సమాచారం. ‘ఆహా’ ఓటీటీ కోసం ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించబోతున్నారు. లాక్‌డౌన్‌ టైమ్‌లోనే సుకుమార్‌ ఈ తొమ్మిది ప్రేమకథలను తీర్చిదిద్దారని తెలిసింది. ప్రస్తుతం అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. గతంలో ‘కుమారి 21ఎఫ్‌' ‘దర్శకుడు’ చిత్రాలకు సుకుమార్‌ కథల్ని అందించిన విషయం తెలిసిందే.

హరీష్‌శంకర్‌ ‘వేదాంతం రాఘవయ్య’

వాణిజ్య కథల్ని తనదైన పంథాలో జనరంజకంగా ఆవిష్కరిస్తూ తెలుగు పరిశ్రమలో అగ్రశ్రేణి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు హరీష్‌శంకర్‌. తాజాగా ఆయన ‘వేదాంతం రాఘవయ్య’ పేరుతో తెరకెక్కనున్న సినిమాకు కథనందిస్తున్నారు. సునీల్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 14రీల్స్‌ సంస్థ నిర్మించనుంది. ఆగస్ట్‌లో ఈ సినిమా ప్రకటన చేశారు. ఈ సినిమాకు కథా రచనతో పాటు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు హరీష్‌శంకర్‌. ఈ చిత్ర కథ గురించి ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. ఈ చిత్రంలో సునీల్‌ పాత్ర పేరు వేదాంత రాఘవయ్య అని చెబుతున్నారు. సమకాలీన అంశాల్ని స్పృశిస్తూ చక్కటి హాస్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని సమాచారం.

వినోదాత్మక కథతో  మారుతి సిరీస్‌

వినోదభరిత కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా దర్శకుడు మారుతిని అభివర్ణిస్తారు. ప్రస్తుతం ఆయన రవితేజ కథానాయకుడిగా ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు. దీనితో పాటు ‘ఆహా’ ఓటీటీ కోసం ఓ వెబ్‌సిరీస్‌కు రచన చేస్తున్నారు. మారుతి కథ, స్క్రీన్‌ప్లే రచన చేస్తున్న ఈ సిరీస్‌ మారుతి శైలి వినోద అంశాలతో సాగుతుందని సమాచారం. ఇప్పటికే ఈ సిరీస్‌ కోసం కథ సిద్ధమైందని ఆయన ప్రకటించారు.   సుప్రసిద్ధ రచయిత చలం రాసిన ‘మైదానం’ నవల ఆధారంగా యువ దర్శకుడు వేణు ఊడుగుల ఓ వెబ్‌సిరీస్‌కు ప్రయత్నాలు చేస్తున్నారు.  యూనివర్సల్‌ అప్పీల్‌ కలిగిన ఈ కథను వెబ్‌సిరీస్‌కు రూపకల్పన చేస్తున్నట్లు తెలిసింది.  ప్రస్తుతం వేణు ఊడుగుల ‘విరాటపర్వం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  ‘పెళ్లిచూపులు’ ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి చిత్రాలతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న తరుణ్‌భాస్కర్‌ కూడా ఓ వెబ్‌సిరీస్‌ కోసం కథా రచన చేస్తున్నట్లు తెలిసింది.

సంపత్‌నంది  ‘ఓదెల రైల్వేస్టేషన్‌'

తెలుగు చిత్రసీమలో మాస్‌పల్స్‌ తెలిసిన దర్శకుడిగా సంపత్‌నందికి మంచి పేరుంది. ప్రస్తుతం ఆయన గోపీచంద్‌ కథానాయకుడిగా ‘సీటీమార్‌' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ‘ఓదెల రైల్వేస్టేషన్‌' ‘బ్లాక్‌రోజ్‌' చిత్రాలకు కథా రచన చేశారు సంపత్‌నంది. తన స్వగ్రామం కరీంనగర్‌ సమీపంలోని ఓదెలలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల స్ఫూర్తితో సంపత్‌నంది ‘ఓదెల రైల్వేస్టేషన్‌' కథను రాసుకున్నారు. ఈ చిత్రానికి అశోక్‌తేజ దర్శకత్వం వహిస్తున్నారు. కె.కె.రాధామోహన్‌ నిర్మాత. ఇటీవలే ఓదెలలో కొన్ని కీలక ఘట్టాల్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు కథా రచనతో పాటు మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు సంపత్‌నంది. వశిష్టసింహ, హెబాపటేల్‌, సాయిరోనక్‌ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. మాజీ మిస్‌ యూనివర్స్‌ ఊర్వశిరౌతేల ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘బ్లాక్‌రోజ్‌' సినిమాకు సంపత్‌నంది క్రియేటర్‌గా ఉన్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. మోహన్‌భరద్వాజ్‌ దర్శకుడు. కార్పొరేట్‌ ప్రపంచంలోని చీకటి కోణాల్ని ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘విచక్షణ లేని యోగ్యతలేని ఆర్థిక లావాదేవీలు మరణానికి సంకేతం’ అనే కౌటిల్యుడి అర్థశాస్త్రంలోని కాన్సెప్ట్‌ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నట్లు సంపత్‌నంది చెప్పారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుంది.


logo