గురువారం 02 జూలై 2020
Cinema - Apr 17, 2020 , 08:41:28

సినీ కార్మికులకు భరోసా

సినీ కార్మికులకు భరోసా

కరోనా ప్రభావం కారణంగా  దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌  విధించడంతో సినిమా, టీవీ  రంగాలపై ఆధారపడిన లక్షలాది మంది దినసరి వేతన కార్మికులు కష్టాల్ని ఎదుర్కొంటున్నారు.  చిత్రీకరణలు నిలిచిపోవడంతో ఉపాధిని కోల్పోయిన వారికి బాలీవుడ్‌, టాలీవుడ్‌తో పాటు భారతీయ చిత్రసీమలోని అగ్రనాయకానాయికలు, దర్శకనిర్మాతలు  భరోసాగా నిలుస్తున్నారు. ఆర్థికంగా సాయం చేయడమే కాకుండా నిత్యవసరాల్ని అందిస్తూ వారి ఆకలి తీరుస్తున్నారు. 

సినీ కార్మికులకు 25లక్షల విరాళం

కరోనా విలయతాండవం సృష్టిస్తున్న వేళ  ఆపన్నులకు  మరోమారు అండగా నిలిచారు బాలీవుడ్‌ అగ్ర నటుడు హృతిక్‌రోషన్‌. ఇప్పటికే అక్షయపాత్ర పౌండేషన్‌తో పాటు ఆరోగ్యసిబ్బందికి సహాయసహకారాలు అందిస్తున్న ఆయన తాజాగా సినీ  ఆర్టిస్ట్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌(సీఏడబ్ల్యుటీ)కు ఇరవై ఐదు లక్షలు విరాళంగా అందజేశారు.  

డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌కు లారెన్స్‌ పదిహేను లక్షలు వితరణ

ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహాయనిధులతో పాటు సినీ కార్మికులకు మూడు కోట్ల విరాళాల్ని  అందించి గొప్ప మనసును చాటుకున్నారు హీరో, దర్శకుడు లారెన్స్‌. గురువారం లారెన్స్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌కు పదిహేను లక్షల్ని సహాయంగా అందించారు. లాక్‌డౌన్‌ కారణంగా నష్టపోయిన పంపిణీదారులను ఆదుకునేందుకు ఈ సొమ్మును వినియోగిస్తామని పంపిణీదారుల సంఘం అధ్యక్షుడు టి.రాజేందర్‌ తెలిపారు. 

సీసీసీకి రెండు లక్షల విరాళం

సినీ కార్మికుల సంక్షేమం కోసం అగ్ర  నటుడు చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటైన కరోనా క్రైసిస్‌ ఛారిటీకి   (సీసీసీ) గురువారం కథానాయిక కాజల్‌ అగర్వాల్‌  రెండు లక్షల విరాళాల్ని అందజేసింది.


logo