శనివారం 06 జూన్ 2020
Cinema - May 07, 2020 , 23:28:29

‘కామ్యాబ్‌'పై పాలో కొయిలోప్రశంసలు

‘కామ్యాబ్‌'పై పాలో కొయిలోప్రశంసలు

‘ది ఆల్కెకెమిస్ట్‌' పుస్తకం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం సంపాదించుకున్నారు బ్రెజిల్‌ రచయిత పాలో కొయిలో. తాజాగా ఆయన హిందీ చిత్రం ‘కామ్యాబ్‌' పై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రాన్ని నిర్మించిన అగ్రహీరో షారుఖ్‌ఖాన్‌ను ట్విట్టర్‌ వేదికగా అభినందించారు. సంజయ్‌మిశ్రా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో క్యారెక్టర్‌ ఆర్టిస్టులు పరిశ్రమలో ఎదుర్కొంటున్న కష్టాల్ని హాస్యకోణంలో ఆవిష్కరించారు. ఈ చిత్రం పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో విమర్శకుల ప్రశంసలందుకుంది. ఈ సినిమాపై పాలో కొయిలో స్పందిస్తూ ‘ఈ సినిమాను వినోదప్రధానంగా నడిపించినప్పటికీ కథాంశంలో అంతర్లీనంగా ట్రాజెడీ ఉంది. కొద్దిరోజుల క్రితం ఓ బ్రెజీలియన్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టు సినీరంగంలో వివక్షకు గురై సరైన అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకున్నారు. పరిశ్రమలో చిన్న ఆర్టిస్టులను ఎలా ట్రీట్‌ చేస్తారో తెలియజేస్తూ సూసైడ్‌ నోట్‌ రాశాడు. గొప్ప సందేశంతో ‘కామ్యాబ్‌' సినిమా నిర్మించిన షారుఖ్‌ఖాన్‌కు కృతజ్ఞతలు’ అని పాలో కొయిలో ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీనిపై షారుఖ్‌ స్పందిస్తూ ‘మా సినిమా గురించి మాట్లాడినందుకు ధన్యవాదాలు. యూనివర్సల్‌ కథాంశమిది. అందుకే అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో మెప్పిస్తోంది. పరిశ్రమలో క్యారెక్టర్‌ ఆర్టిసుల్ని పట్టించుకోవడం లేదు. ఇది అందరూ అంగీకరించాల్సిన విషాదమైన సత్యం’ అని చెప్పారు. ‘కామ్యాబ్‌' చిత్రం మార్చి 6న విడుదలైంది.


logo