e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home సినిమా బాలీవుడ్‌ కాలింగ్‌

బాలీవుడ్‌ కాలింగ్‌

బాలీవుడ్‌ కాలింగ్‌

గత ఏడాదికాలంగా భారతీయ వినోదరంగంలో డిజిటల్‌ ఓటీటీల ప్రాభవం బాగా పెరిగింది. లాక్‌డౌన్‌ నియంత్రిత పరిస్థితుల్లో ఇంటిపట్టునే కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించే వేదికలుగా ప్రతి గడపకు ఓటీటీలు చేరువయ్యాయి. డిజిటల్‌ మీడియా ఉధృతి వల్ల భాషాపరమైన హద్దులు కూడా చెదిరిపోతున్నాయి. వినూత్న కథాంశాలతో తెరకెక్కుతున్న వెబ్‌సిరీస్‌లకు దేశవ్యాప్తంగా ఆదరణ పెరగడంతో ప్రాంతీయ తారలకు హిందీ చిత్రసీమలో డిమాండ్‌ ఎక్కువవుతోంది. అటు వెబ్‌సిరీస్‌లతో పాటు ప్రధాన స్రవంతి బాలీవుడ్‌ సినిమాల్లో దక్షిణాది తారలకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. కెరీర్‌ ఆరంభంలో బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకొని దక్షిణాదిలో స్థిరపడిన తారలు కూడా ఇప్పుడు హిందీ వైపు అడుగులు వేస్తున్నారు. భాషా భేదాలతో సంబంధం లేకుండా ప్రతిభ మాత్రమే కొలమానంగా సినీ తారలు పాన్‌ఇండియా స్థాయిలో సత్తాచాటుతున్నారు.
పుష్కరకాలంగా దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరిగా దూసుకుపోతోంది చెన్నై చిన్నది సమంత. తెలుగు, తమిళ భాషల్లో తిరుగులేని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న ఆమె ‘ఫ్యామిలీమెన్‌-2’ వెబ్‌సిరీస్‌ ద్వారా హిందీ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది. తమిళ పోరాటయోధురాలు రాజీ పాత్రలో సమంత అద్భుతాభినయానికి దేశవ్యాప్తంగా ప్రశసంలు లభిస్తున్నాయి. ఈ సిరీస్‌ ద్వారా సమంత పేరు ముంబయి చిత్రసీమలో మార్మోగిపోయింది. మరికొన్ని బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ల కోసం హిందీ దర్శకనిర్మాతలు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలిసింది. తెలుగు తెరపై తళుక్కున మెరిసిన కన్నడ సోయగం ప్రణీత సైతం ప్రస్తుతం హిందీలో ‘హంగామా-2’, ‘భుజ్‌-ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రాల్లో ఓ కథానాయికగా నటిస్తోంది. పదేళ్లుగా కేవలం దక్షిణాదికే పరిమితమైపోయిన ఈ వయ్యారి హిందీ చిత్రసీమలో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతోంది. బాలీవుడ్‌ అరంగేట్రంతో తన కెరీర్‌కు తిరుగుండదనే ధీమాతో ఉంది ప్రణీత.

బాలీవుడ్‌ కాలింగ్‌

దక్షిణాది సినీరంగంలో అనతికాలంలోనే అగ్రపథాన్ని అందుకున్న కథానాయికగా రష్మిక మందన్న మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో జరిగిన ఓ ఆన్‌లైన్‌ పోల్‌లో ఈ భామ నేషనల్‌ క్రష్‌గా నిలిచింది. యువతరంలో తిరుగులేని ఫాలోయింగ్‌ కలిగిన ఈ కన్నడ సొగసరి ‘మిషన్‌ మజ్ను’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తోంది. దేశభక్తి ప్రధానంగా స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా బాలీవుడ్‌లో తనకు శుభారంభాన్నిస్తుందనే నమ్మకంతో ఉంది రష్మిక. దీనితో పాటు బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గుడ్‌బై’ చిత్రంలో కూడా రష్మిక మందన్న ముఖ్యపాత్రను పోషిస్తోంది. ఓవైపు తెలుగు, తమిళ భాషల్లో డేట్స్‌ ఖాళీ లేకున్నా పాన్‌ ఇండియా తారగా గుర్తింపు తెచ్చుకునే లక్ష్యంతో రష్మిక మందన్న బాలీవుడ్‌ వైపు దృష్టిపెడుతోంది.

- Advertisement -

వెండితెర అందాల చందమామగా అభిమానులు పిలుచుకునే పంజాబీ ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్‌ ప్రస్తుతం తెలుగు, తమిళంతో పాటు హిందీ చిత్రసీమకు సమ ప్రాధాన్యతనిస్తోంది. నాయికగా బాలీవుడ్‌ పరిశ్రమలోనే అరంగేట్రం చేసిన ఈ సుందరి అనంతరం దక్షిణాదిలోనే కెరీర్‌ను తీర్చిదిద్దుకుంది. మధ్యలో కొన్ని హిందీ సినిమాలు చేసినా ఆశించిన ఫలితాలు రాలేదు. తాజాగా ఆమె ‘ఖైదీ’ (కార్తి చిత్రం) హిందీ రీమేక్‌లో అజయ్‌దేవ్‌గణ్‌ సరసన కథానాయికగా నటించనుంది. ఈ సినిమాతో పాటు ‘ఉమా’ పేరుతో తెరకెక్కన్ను మహిళా ప్రధాన కుటుంబ కథా చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ నటించబోతున్నది.

‘మక్కల్‌ సెల్వన్‌’గా దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితుడయ్యారు విజయ్‌ సేతుపతి. ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తమిళ, తెలుగు భాషల్లో మంచి స్టార్‌డమ్‌ సంపాదించుకున్న ఆయన ప్రస్తుతం బాలీవుడ్‌లో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. శ్రీరామ్‌రాఘవ్‌ దర్శకత్వం వహిస్తున్న ‘మెర్రీ క్రిష్టమస్‌’ చిత్రంలో విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. తొంభై నిమిషాల నిడివితో ప్రయోగాత్మక ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కత్రినాకైఫ్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు కిషోర్‌ పాండురంగ్‌ దర్శకత్వంలో ‘గాంధీటాక్స్‌’ పేరుతో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు విజయ్‌ సేతుపతి. అమీర్‌ఖాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘లాల్‌సింగ్‌ చద్దా’ చిత్రంలో తెలుగు యువహీరో నాగచైతన్య కీలక పాత్రలో కనిపించబోతున్నారు. బాలీవుడ్‌లో ఆయనకిది తొలిచిత్రం కావడం విశేషం. త్వరలో జరిగే షెడ్యూల్‌లో నాగచైతన్య పాల్గొనబోతున్నారు. ఈ కోవలోనే మరికొంత మంది దక్షిణాది నటీనటులకు బాలీవుడ్‌ నుంచి మంచి ఆఫర్లొస్తున్నాయని తెలిసింది. ఓటీటీల ప్రభావంతో పాటు పాన్‌ ఇండియా సినిమాల ట్రెండ్‌ పెరగడంతో వాణిజ్యపరమైన సమీకరణాలను బేరిజు వేసుకుంటున్న హిందీ దర్శకనిర్మాతలు దక్షిణాది తారలపై ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నారని చెబుతున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బాలీవుడ్‌ కాలింగ్‌
బాలీవుడ్‌ కాలింగ్‌
బాలీవుడ్‌ కాలింగ్‌

ట్రెండింగ్‌

Advertisement