అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో జరిపిన చిట్‌చాట్‌లో తమిళ యువ దర్శకుడు విఘ్నేష్‌శివన్ పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. ముఖ్యంగా ఆయన ప్రేయసి, అగ్ర కథానాయిక నయనతార గురించి అభిమానులు ఎక్కువగా ప్రశ్నలడిగారు. గత ఐదేళ్లుగా విఘ్నేష్‌శివన్-నయనతార ప్రేమలో ఉన్నారు. ప్రస్తుతం వారిద్దరూ చెన్నైలో సహజీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి గురించి విఘ్నేష్‌శివన్ స్పందించారు. తామిద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని, అందుకోసం ఇప్పటి నుంచే డబ్బుల్ని పొదుపు చేస్తున్నామని చెప్పారు. నయనతార తన జీవితంలోకి ప్రవేశించిన తర్వాత ప్రతిక్షణం అద్భుతంగా గడుస్తోందని..ఆమెతో కలిసి ఉంటే ఏ ప్రదేశమైనా అందంగా కనిపిస్తుందని తెలిపారు. నయనతార తల్లి మిసెస్ కురియన్ తన జీవితంలో చూసిన అత్యద్భుతమైన మహిళ అని ప్రశంసించారు. నయన్ చీరకట్టులో చాలా అందంగా ఉంటుందని, ఆమె నెయ్యితో చేసే చికెన్ కర్రీని తాను ఎంతగానో ఇష్టపడతానని చెప్పుకొచ్చారు. అభిమానులు నయనతార గురించి చాలా ప్రశ్నలు అడగటం ఆనందంగా ఉందని, ఆమె ప్రేమను పొందడం మాటల్లో వర్ణించలేని గొప్ప అనుభవమని విఘ్నేష్‌శివన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నయనతారతో పర్సనల్‌గా తీసుకున్న కొన్ని ఫొటోల్ని అభిమానులతో పంచుకున్నారాయన. ప్రస్తుతం ఈ చిట్‌చాట్ సోషల్‌మీడియాలో అందరిని ఆకట్టుకుంటోంది.