అఖిల్ అక్కినేని, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు, వాసువర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘లెహరాయి, లెహరాయి.. గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి’ అనే పల్లవితో సాగే గీతాన్ని బుధవారం చిత్రబృందం విడుదలచేసింది. సిధ్ శ్రీరామ్ ఆలపించిన ఈ గీతానికి శ్రీమణి సాహిత్యాన్ని అందించారు. గోపీసుందర్ స్వరకర్త. నిర్మాతలు మాట్లాడుతూ ‘కుటుంబ విలువలతో ముడిపడి సాగే ప్రేమకథా చిత్రమిది. నచ్చిన అమ్మాయిని పెళ్లిచేసుకోవాలనుకున్న ఓ యువకుడి స్వప్నం ఎలా సాకారమైందన్నది ఆకట్టుకుంటుంది. ‘లెహరాయి’ గీతానికి చక్కటి స్పందన లభిస్తోంది. ఈ పాటలో అఖిల్, పూజాహెగ్డే కెమిస్ట్రీ బాగుందంటున్నారు. అక్టోబర్ 8న ఈ సినిమాను విడుదలచేయనున్నాం’ అని తెలిపారు. ఆమని, మురళీశర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రదీశ్ ఎమ్వర్మ.