ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 24, 2020 , 08:52:35

దివిని కిడ్నాప్ చేసిన రోబో టీం..ఆవేశంతో ఊగిపోయిన సోహైల్

దివిని కిడ్నాప్ చేసిన రోబో టీం..ఆవేశంతో ఊగిపోయిన సోహైల్

ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ మంగ‌ళ‌వారం ఉక్కు హృదయం అనే టాస్క్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ టాస్క్‌లో భాగంగా హౌజ్‌మేట్స్ రెండు టీంలుగా విడిపోయారు. రోబోలు VS మనుషులు మ‌ధ్య జ‌రుగుతున్న టాస్క్ మంగ‌ళ‌వారం కొంత ఫ‌న్‌గానే న‌డిచిన బుధ‌వారం మొత్తం ర‌చ్చ‌గా మారింది. రోబోల టీం ఛార్జింగ్ కోసం మ‌నుషుల టీంలో ఒక‌రిని కిడ్నాప్ చేసే స్కెచ్ వేయ‌గా, అది బాగానే వ‌ర్క‌వుట్ అయింది. అయితే ఆడ‌పిల్ల‌ని అడ్డం పెట్టుకొని గేమ్ ఆడుతారా అంటూ మ‌నుషుల టీం నానా రచ్చ చేయ‌డం ప్రేక్ష‌కుల‌కు చాలా విసుగు తెప్పించింది. 

మ‌నుషుల టీంలో బాయ్స్  అందరు చాలా స్ట్రాంగ్‌గా ఉండ‌డంతో అమ్మాయిని కిడ్నాప్ చేయాల‌ని అభిజిత్ ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉన్న మ‌నుషుల టీం ద‌గ్గ‌ర‌కు వెళ్ళి వాష్ రూంని ఫ్రీగా ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇందుకు మేం మీ దగ్గ‌ర నుండి ఏం ఆశించం అంటూ అఖిల్‌తో చెప్పుకొచ్చాడు అభిజిత్‌. అయితే దీనిపై మోనాల్‌తో కొంత సేపు ఆలోచించిన అఖిల్  వెనుక‌డుగు వేశాడు. ఆ త‌ర్వాత గంగ‌వ్వ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. లోప‌లికి ఒక‌రిని తీసుకొచ్చేందుకు త‌న వంతు ప్ర‌య‌త్నం చేసింది. 

ఆడ పిల్లలు బాత్ రూంలకు పోకుండా తినకుండా ఎంతసేపు ఉంటారు లోపలికి రండి, నాకు నిద్ర ప‌డ‌త‌లేదు అంటూ కిడ్నాప్ కోసం స్కెచ్ వేసింది గంగవ్వ. అయితే ఆ స్కెచ్ అంత‌గా వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో మ‌ళ్ళీ అభిజిత్ బ‌య‌ట‌కు వ‌చ్చి వాష్ రూంకి వెళ్ళాల్సి వ‌స్తే ఒక‌రి త‌ర్వాత ఒక‌రు వెళ్లొచ్చు అని చెప్పాడు. దీంతో వెంట‌నే దివి వాష్ రూంకి వెళ్లేందుకు సిద్ధ‌మైంది.  లోప‌ల‌కి వ‌చ్చిన దివిని ప‌క్కా ప్లాన్‌తో రోబో టీం బంధించారు. ఆమెకు అన్ని స‌ప‌ర్య‌య‌లు చేస్తూనే దివి నుండి ఛార్జింగ్ తీసుకున్నారు. 

దివిని బంధించ‌డంతో గ‌ట్టిగా అర‌వ‌గా, బ‌య‌ట ఉన్న మ‌నుషుల టీం ఆమెకు ఏదో అయిపోతుంద‌ని తెగ హైరానా చెందారు. ఆవేశంతో ఊగిపోయారు. మొనాల్ పిచ్చి ప‌ట్టిన‌ట్టు ఏడ్వ‌డం, సోహైల్ శివాలెత్త‌డం, మెహ‌బూబ్ పిచ్చి ప‌ట్టిన‌ట్టు అర‌వ‌డం ప్రేక్ష‌కుల‌కు చాలా విసుగు తెప్పించాయి. ముఖ్యంగా సోహైల్‌, మెహ‌బూబ్‌, మోనాల్‌ల ఓవ‌రాక్ష‌న్ ప‌రిధి దాటింది.  మీకు సిగ్గు ఉందా? కథ వేరే ఉంటుంది అంటూ నానా రచ్చ చేశాడు సోహైల్‌. బ‌య‌ట డోర్ ద‌గ్గ‌ర మ‌నుషుల టీం చేసిన వీరంగంను గ‌మనిస్తున్న రోబోల టీం ఇదేమి ప‌ట్టించుకోకుండా దివికి సేవ‌లు చేస్తూనే ఆమె ద‌గ్గ‌ర నుండి చార్జింగ్ తీసుకున్నారు. 

ఒకానొక స‌మ‌యంలో తూ.. ఒక అమ్మాయిని అడ్డుపెట్టుకుని ఆట ఆడతావ్.. నీదీ ఓ బతుకేనా? త‌ర్వాత చూస్తాం నీ సంగ‌తి అంటూ సోహైల్‌, మెహ‌బూబ్‌లు ఇష్ట‌మోచ్చిన‌ట్టు మాట్లాడారు. వారికి స‌ర్ధిచెప్దామ‌ని వ‌చ్చిన కుమార్‌పై కూడా ఫైర్ అయ్యారు. ప‌డుకొని ఉన్న త‌న‌ని ఎందుకు లేప‌లేదంటూ సోహైల్ తోటి టీం స‌భ్యుల‌పై కూడా ఫైర్ అయ్యాడు. ఆడ‌, మ‌గ అనే తేడా లేకుండా ఏడ‌వ‌డాలు, నోటికొచ్చిన‌ట్టు అర‌వ‌డాలు, ప్రాప‌ర్టీస్ నాశ‌నం చేయ‌డం వంటివి మ‌నుషుల టీం చేయ‌డంతో వారికి బిగ్ బాస్ నుండి పెద్ద ప‌నిష్మెంటే వ‌స్తుంద‌ని నెటిజ‌న్స్ భావిస్తున్నారు. 

ఇక ఛార్జింగ్ కోసం అరియానా బ‌య‌ట గార్డెన్ ఏరియాలో ఉన్న మ‌నుషుల టీం ద‌గ్గ‌ర‌కు మెల్ల‌గా వెళ్లేందుకు ప్ర‌య‌త్నించింది. ఇది సోహైల్ గ‌మ‌నించాడు. మెహ‌బూబ్ ని లేపి అరియానా వ‌చ్చింద‌ని చెప్పాడు. గేమ్‌లో భాగంగానే తాను వ‌చ్చిన‌ట్టు అరియానా ఒప్పుకుంది. గురువారం కూడా ఈ ర‌చ్చ  కొన‌సాగ‌నుంది. అయితే తాజాగా చూపించిన ప్రోమోలో అవినాష్ తెలివి తేట‌ల‌కు మాస్ట‌ర్ అమాయ‌క చ‌క్ర‌వ‌ర్తి అయిన‌ట్టు అర్ధ‌మైంది. రాజ‌శేఖ‌ర్ తో మాట్లాడుతూనే అవినాష్ త‌ను ఛార్జింగ్ పెట్టుకోవ‌డాన్ని చూసి అంద‌రు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు.  


logo