బుధవారం 03 మార్చి 2021
Cinema - Jan 22, 2021 , 21:53:05

అందుకే నో చెప్పిన సింగర్‌ సునీత

అందుకే నో చెప్పిన సింగర్‌ సునీత

సినిమా  ఇండస్ట్రీలో ఎంతో మంది సింగర్స్ ఉన్నారు.  అందులో  కొంతమందికే అభిమానుల్లో విశేషాదరణ ఉంటుంది. మరికొందరు మాత్రం తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటారు. అందులో గాయని సునీత ప్రత్యేకం. తెలుగులో ఈమెకు చాలా పాపులారిటీ ఉంది. మధురమైన గాత్రంతో పాటు అంతకంటే అందమైన రూపంతో అందర్నీ ఆకట్టుకుంది సునీత. అప్పుడెప్పుడో 27 ఏళ్ల కింద కృష్ణవంశీ తెరకెక్కించిన గులాబీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సునీత.. ఇప్పటి వరకు అదే క్రేజ్ కొనసాగిస్తోంది. ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావో అనే ఒక్క పాటతో సునీత రేంజ్ మారిపోయింది. 

అందంగా  ఉండడంతో ఈమెకు   హీరోయిన్‌గా కూడా అవకాశాలు వచ్చాయి.   ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శక నిర్మాతలు మీరు నటిగా మారితే అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది సునీతకు ఎంతగానో చెప్పారు. కానీ ఈమె మాత్రం మనసు మార్చుకోలేదు. సింగింగ్ ట్రాక్ నుంచి బయటికి రాలేదు. అంతెందుకు సునీత ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనగనగా ఒక రోజు సినిమాలో హీరోయిన్ అవకాశం ఇచ్చాడు. అయితే ఆయన ఇచ్చిన అవకాశాన్ని చాలా సున్నితంగా తిరస్కరించింది సునీత. కనీసం ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఊర్మిళకు డబ్బింగ్ చెప్పమని ఆయన కోరడంతో ఓకే చెప్పింది.  

ఈ సినిమా ఎడిటింగ్ రూమ్ లో చూస్తున్నప్పుడు ఆమె వాయిస్ సెట్ అవ్వదు అని తెలిసి మార్చేశాడు వర్మ. ఇదిలా ఉంటే అప్పట్లో వరుస విజయాలతో సంచలనం సృష్టిస్తున్న దిగ్గజ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కూడా సునీతకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. కానీ హీరోయిన్ గా మారితే  కష్టాలు ఉంటాయని, వాటిని దగ్గర నుంచి చూశానని.. అలాంటి జీవితం తనకు వద్దు అంటూ ఆయన ఇచ్చిన అవకాశాన్ని కూడా తిరస్కరించింది సునీత. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది హీరోయిన్ గా మారమని సలహా ఇచ్చినా కూడా అందరికీ నో చెప్పింది ఆమె. ఇవన్నీ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పింది సునీత. మరి ఇప్పుడు అవకాశం వస్తే చేస్తారా అంటే ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని అనవసరంగా మార్చడం ఎందుకు.. ఇప్పుడు అంతా బాగానే ఉంది అని సమాధానం వచ్చింది.  ఈ మధ్యే బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేనిని సునీత రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.  

VIDEOS

logo