గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Oct 07, 2020 , 01:33:57

స్కూల్‌మేటే కాజల్‌కు సోల్‌మేట్‌

స్కూల్‌మేటే కాజల్‌కు సోల్‌మేట్‌

  • స్కూల్‌మేట్‌ టు సోల్‌మేట్‌

వెండితెర అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌ ఈ నెల 30న పెళ్లిపీటలెక్కబోతున్నది. ముంబయికి చెందిన వ్యాపారవేత్త, పాఠశాల రోజుల నుంచి సహచరుడు అయిన గౌతమ్‌కిచ్లును తాను వివాహం చేసుకోబోతున్నట్లు కాజల్‌అగర్వాల్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ చేసింది. ‘నా జీవితంలోని అత్యంత ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది.  ఈ నెల 30న ముంబయిలో ఇరు కుటుంబాలకు చెందిన ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నా. జీవితంలో కొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తున్న నాకు మీ అందరి ఆశీస్సులు కావాలి. కొన్నేళ్లుగా మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి. మీ అందరి దీవెనలతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నా. వివాహ అనంతరం కూడా సినిమాల్లో నటిస్తూ అభిమానుల్ని అలరిస్తాను. మీ అంతులేని ప్రేమకు సర్వదా కృతజ్ఞురాలిగా ఉంటాను’ అని కాజల్‌ అగర్వాల్‌ పేర్కొంది. కాజల్‌ అగర్వాల్‌ వివాహ వార్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్‌తో పాటు దక్షిణాదికి చెందిన పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా కాజల్‌ అగర్వాల్‌కు శుభాకాంక్షలందజేశారు. స్కూల్‌ రోజుల నుంచి గౌతమ్‌కిచ్లుతో కాజల్‌ అగర్వాల్‌కు పరిచయం ఉందని చెబుతున్నారు. సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ ఫొటోపై ‘స్కూల్‌మేట్‌ టు సోల్‌మేట్‌' అనే క్యాప్షన్‌ రాసి ఉండటంతో వీరిద్దరికి పాఠశాల రోజుల నుంచే చక్కటి అనుబంధం ఉందని అర్థమవుతోంది. గౌతమ్‌కిచ్లు ముంబయిలోని కేథడ్రల్‌ అండ్‌ జాన్‌ కానన్‌ స్కూల్‌లో చదువుకున్నాడు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాడు. ప్రస్తుతం ఓ ఇంటీరియర్‌ డిజైనింగ్‌ సంస్థను నిర్వహిస్తున్నాడు. ముంబయిలోని యువ పారిశ్రామికవేత్తల్లో ఒకరిగా గౌతమ్‌కిచ్లుకి పేరుంది.


logo