గురువారం 28 మే 2020
Cinema - May 11, 2020 , 01:19:29

నాన్న ఎప్పుడూ కోప్పడలేదు

నాన్న ఎప్పుడూ కోప్పడలేదు

జీవితంలోని భిన్న పార్శాలకు సంబంధించి సమాధానం దొరకని  ప్రశ్నలు ఎన్నో మిగిలిపోయానని, ఈ లాక్‌డౌన్‌ విరామంలో వాటిని శోధించే ప్రయత్నంలో ఉన్నానని తెలిపింది శృతిహాసన్‌.  ప్రస్తుతం కుటుంబసభ్యులకు దూరంగా ముంబయిలో   ఒంటరిగా ఉంటున్నదామె.  సంగీతం, కొత్త వంటకాలతో లాక్‌డౌన్‌ టైమ్‌ను ఆస్వాదిస్తోంది.  సమయం దొరికినప్పుడు అభిమానులతో సామాజిక మాధ్యమాల ద్వారా ముచ్చటిస్తోంది. శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె బదులిస్తూ  ‘నాన్న కమల్‌హాసన్‌ ప్రస్తుతం చెన్నైలో ఉన్నారు. స్వీయనిర్బంధంలో ఉన్నారు. నాన్న నాపై  కోపగించుకోవడం, తిట్టడం ఎప్పుడూ జరగలేదు. మేము ఏదైనా తప్పు చేస్తే అందుకు కారణమేమిటో తెలుసుకునేవారు. ‘నన్ను బాధపెట్టకుండా మళ్లీ ఆ తప్పు చేయొద్దు’ అని  హెచ్చరించేవారు. నేను దేవుడిని నమ్ముతాను. నమ్మకాల విషయంలో ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కోలా ఉంటాయి.  డబ్బు, హృదయాన్ని, విగ్రహాల్ని ఎవరికి నచ్చినదానిని వాళ్లు ఆరాధిస్తుంటారు.  నేనే గొప్ప అనుకోకుండా మనకు మించిన మహత్తరమైన శక్తి మరొకటి ఉందనే భావాన్ని కలిగి ఉండటం ముఖ్యం. నాకు గులాబీ పువ్వు అంటే ఇష్టం. నా చేతిపై గులాబీ టాటూ వేసుకున్నాను.  క్వారంటైన్‌ టైమ్‌లో జీవితాన్ని సానుకూల దృక్పథంతో ఎలా కొనసాగించాలో అర్థమైంది. షూటింగ్‌, సెట్స్‌లో ఉండే ఆనందాల్ని చాలా మిస్‌ అవుతున్నా.  లాక్‌డౌన్‌ ముగియగానే మొదటగా సినిమాల్ని పూర్తిచేయడంపైనే  దృష్టిసారిస్తా ’ అని తెలిపింది. నన్ను పెళ్లిచేసుకుంటారా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ‘సారీ’ అంటూ సమాధానమిచ్చింది శృతిహాసన్‌. logo