రచయిత ప్రేయసిగా

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వినూత్న కథలకు చిరునామాగా నిలుస్తున్నాయి. అగ్ర తారలు పాత్రలపరంగా ప్రయోగాలు చేయడానికి వెబ్‌సిరీస్‌లను వేదికలుగా ఎంచుకుంటున్నారు. ఇప్పటికే పలువురు కథానాయికలు వెబ్‌సిరీస్‌లలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శృతిహాసన్ హిందీ వెబ్‌సిరీస్‌లో సీనియర్ హీరో మిథున్చక్రవర్తితో కలిసి నటించబోతున్నది. ‘ది బెస్ట్ సెల్లర్ షీ రోట్' అనే పాపులర్ నవల ఆధారంగా ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించబోతున్నారు. ఇందులో ప్రఖ్యాత నవలా రచయితగా మిథున్ చక్రవర్తి నటిస్తుండగా..ఆయన ప్రేయసిగా శృతిహాసన్ కనిపించనుంది. వీరిద్దరి బంధంలోని సంఘర్షణ ఆద్యంతం భావోద్వేగభరితంగా సాగుతుందని దర్శకుడు ముకుల్ అభ్యంకర్ తెలిపారు. శృతిహాసన్ పాత్ర భిన్న కోణాల్లో సాగుతుందని, ఆమె కెరీర్లో ఉత్తమమైనదిగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లో ఈ సిరీస్ షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. తెలుగులో ఇటీవల వచ్చిన ‘క్రాక్' చిత్రం ద్వారా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది శృతిహాసన్.