బుధవారం 03 జూన్ 2020
Cinema - May 12, 2020 , 23:13:28

అందమైన సాయంత్రాల్ని మిస్సవుతున్నా!

అందమైన సాయంత్రాల్ని మిస్సవుతున్నా!

ఒకప్పుడు దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరిగా సత్తా చాటింది శ్రియ. కెరీర్‌పరంగా ఎన్నో కమర్షియల్‌ విజయాల్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోందీ సుందరి. భర్త ఆండ్రూ కొశ్చెవ్‌తో కలిసి ప్రస్తుతం ఈ సొగసరి స్పెయిన్‌లో ఉంది. అక్కడ కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఇంట్లో స్వీయనిర్భందాన్ని పాటిస్తోందట. ఈ సందర్భంగా శ్రియ చెప్పిన సంగతులివి..

కరోనా ప్రభావంతో మీకు బాగా ఇబ్బందిగా అనిస్తున్నదేమిటి?

గత నెలరోజుల నుంచి కేవలం నాలుగుసార్లు మాత్రమే బయటకు వెళ్లగలిగాం. ఎక్కడా చూసిన అనిశ్చిత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సంక్షోభం ఎంతవరకు వెళ్తుందనే ఆందోళన ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది.

ఒకవేళ ఈ మహమ్మారి రాకపోయి వుంటే ఏం చేసేవారు?

బీచ్‌లో అందమైన సాయంత్రాల్ని  గడుపుతూ అద్భుతమైన సూర్యాస్తమయాల్ని చూడాలని కలలు కన్నా. కరోనా ఎఫెక్ట్‌ వల్ల గత కొన్ని రోజులుగా అవన్నీ తీరని కలలుగా మిగిలిపోయాయి.

ఈ విరామ సమయాన్ని ఎలా గడుపుతున్నారు?

మా లివింగ్‌రూమ్‌లో అధునాతమైన హోమ్‌థియేటర్‌ ఉంది. డిన్నర్‌ అనంతరం ఆండ్రూతో కలిసి సినిమాలు చూస్తున్నా. ఈ మధ్య మోడ్రన్‌ లవ్‌, నేక్‌డ్‌ సినిమాలతో పాటు హిందీ ‘పంచాయత్‌' సిరీస్‌ చూశాను.

కొత్తగా ఏమైనా నేర్చుకుంటున్నారా?

స్పానిష్‌ నేర్చుకుంటున్నా. కేక్‌ తయారుచేయడం ఎలాగో తెలుసుకున్నా. వివిధరకాల వంటకాలపై ప్రయోగాలు చేస్తున్నా. ఈ మధ్యే స్పానిష్‌ ైస్టెల్‌లో చేసిన ఆమ్లెట్‌ చూసి అద్భుతంగా ఉందని ఆండ్రూ మెచ్చుకున్నారు.

స్వీయనిర్బంధం ద్వారా ఏం తెలుసుకున్నారు?

జీవితంలో ఇదివరకటి వేగం తగ్గింది. ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు ఇక్కడి వాళ్లందరూ బాల్కనీల్లోకి వచ్చి కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్యసిబ్బందికి సంఘీభావంగా చప్పట్లు కొడతారు. అది అలవాటుగా మారింది. ఆ టైమ్‌లోనే చుట్టపక్కల వారితో దూరం నుంచే సంభాషించడం, ఏవో జోక్స్‌ పేల్చుతూ కాలాన్ని గడపటం నిత్యకృత్యమైంది.logo