హైదరాబాద్ : ప్లే బ్యాక్ సింగర్ శ్రేయ ఘోషల్ తన చిన్నారి కొడుకు మొదటి ఫోటోను ప్రపంచంతో పంచుకుంది. తన కుమారుడికి దేవ్యాన్ ముఖోపాధ్యాయ అని పేరు పెట్టినట్లు తెలిపిన శ్రేయ కొడుకును చేతుల్లోకి తీసుకుని భర్త శిలాదిత్యతో కలిసి ఉన్న ఫోటోను బుధవారం ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. మే 22న వచ్చిన ఇతడు మా జీవితాలను శాశ్వతంగా మార్చినట్లు తెలిపింది. మా హృదయాలను ప్రేమతో నింపాడు. ఇది ఒక తల్లి, తండ్రి మాత్రమే అనుభవించే ఫీలింగ్ అన్నారు. ఈ అందమైన జీవిత బహుమతికి కృతజ్ఞతలని పేర్కొన్నారు.
మే 22వ తేదీన శ్రేయ ఘోషల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇన్స్టాగ్రామ్లో అప్పటి తన సంతోషాన్ని అభిమానులతో ఈ విధంగా పంచుకున్నారు. ఈ మధ్యాహ్నం మాకు మగ బిడ్డ పుట్టాడు. ఇలాంటి ఫీలింగ్ గతంలో ఎప్పుడూ అనుభవించలేదు. ప్రస్తుతం నేను, నా భర్త, నా కుటుంబం మొత్తం సంతోషంలో ఉన్నట్లు పేర్కొంది.