శనివారం 06 జూన్ 2020
Cinema - May 09, 2020 , 22:48:04

నిరీక్షణ ఎవరి కోసం?

నిరీక్షణ ఎవరి కోసం?

‘భానుమతి..సింగిల్‌ పీస్‌..హైబ్రిడ్‌ పిల్ల’..‘ఫిదా’ సినిమాలో  తన పాత్ర గురించి సాయిపల్లవి చెప్పిన ఈ డైలాగ్‌ ఎంతో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. ఆమె అభినయప్రతిభను విశ్లేషిస్తే ఆ మాటలు అక్షర సత్యాలనిపిస్తాయి. అభినయం, అందం కలబోతగా దక్షిణాదిన విలక్షణ నాయికగా భాసిల్లుతోంది ఈ తమిళ సొగసరి. శనివారం సాయిపల్లవి జన్మదినం సందర్భంగా ఆమె కథానాయికగా నటిస్తున్న ‘విరాటపర్వం’చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకుడు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. ఈ పోస్టర్‌లో అడవిలో అమరవీరుల స్మారక స్తూపం వద్ద నిరీక్షిస్తూ కనిపిస్తోంది సాయిపల్లవి. ‘అడవి మార్గాన ఉన్న ఆ అమరవీరుల స్తూపం దగ్గరే ఆమె ఎందుకు ఒంటరిగా కూర్చుంది? ఎవరి కోసం ఆమె నిరీక్షణ? ఆమె ఒడిలోని డైరీలో రాసి ఉన్న అక్షరాలేమిటి? ఈ ప్రశ్నలకు జవాబులు విడుదల తర్వాతే’ అంటూ దర్శకుడు వేణు ఊడుగుల ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: డానీ సాంచెజ్‌ లోపెజ్‌, దివాకర్‌మణి, సంగీతం: సురేష్‌ బొబ్బిలి, సమర్పణ: సురేష్‌బాబు.

హృద్యమైన భావాల ‘లవ్‌స్టోరీ’

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. శ్రీవెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌.ఎల్‌.పి పతాకంపై నారాయణ్‌దాస్‌ కె నారంగ్‌, పి. రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్నారు. సాయిపల్లవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తాజా పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, ‘ఏయ్‌ పిల్లా’ పాటకు మంచి స్పందన లభిస్తోంది. తనదైన వినూత్న శైలిలో హృద్యమైన ప్రేమకథగా దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. మరో 15రోజుల షూటింగ్‌ మిగిలి ఉంది. లాక్‌డౌన్‌ తొలగిపోయిన తర్వాత చిత్రీకరణకు ప్లాన్‌ చేస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విజయ్‌ సి కుమార్‌, సంగీతం: పవన్‌ సి హెచ్‌.


logo