సోమవారం 13 జూలై 2020
Cinema - Apr 03, 2020 , 22:41:07

ఆరువేల కుటుంబాలకు అండగా..

ఆరువేల కుటుంబాలకు అండగా..

నేడు ప్రపంచ మానవాళి యావత్తు కరోనా కోరల్లో చిక్కి విలవిలలాడుతోందని, ఈ సంక్షుభిత పరిస్థితుల్ని జయించడానికి మానవత్వ వ్యక్తీకరణను మించిన మహాసాధనం లేదని బాలీవుడ్‌ బాద్షా షారుఖ్‌ఖాన్‌ ఉద్ఘాటించారు. కరోనా విపత్తును ఎదుర్కోవడానికి తాను చేపట్టబోయే సహాయ కార్యక్రమాల వివరాల్ని ఆయన ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. షారుఖ్‌ఖాన్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న రెడ్‌ చిల్లీస్‌, మీర్‌ఫాండేషన్‌, రెడ్‌ చిల్లీస్‌ వీఎఫ్‌ఎక్స్‌ సంస్థలు  సంయుక్తంగా ఈ సహాయ చర్యల్లో పాలుపంచుకోబోతున్నాయి. పీఎం కేర్స్‌కు నగదు విరాళంతో పాటు మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వాలకు మద్దతుగా షారుఖ్‌ఖాన్‌ పలు సహాయ కార్యక్రమాల్ని చేపట్టబోతున్నారు.

మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌లో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్లు, ఆరోగ్య శాఖ ఉద్యోగులకు 50వేల రక్షణ కిట్లను పంపిణీ చేయబోతున్నట్లు షారుఖ్‌ఖాన్‌ తెలిపారు. ముంబయిలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ ఏక్‌సాథ్‌తో కలిసి దాదాపు 6000 కుటుంబాలకు నెలరోజుల పాటు భోజనాన్ని అందిస్తామన్నారు. ముంబయి కేంద్రంగా పనిచేసే రోటీ ఫాండేషన్‌తో కలిసి రోజుకు పదివేల మీల్స్‌ చొప్పున ఒక నెలపాటు పేదవారికి, దినసరి కార్మికులకు భోజనాన్ని సమకూర్చబోతున్నామని షారుఖ్‌ఖాన్‌ పేర్కొన్నారు. ఢిల్లీలో 2500 మంది డెయిలీ వర్కర్లకు ప్రతి రోజు నిత్యవసర వస్తువుల్ని అందించబోతున్నామని చెప్పారు. అయితే పీఎం కేర్స్‌తో పాటు  మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వాలకు ఎంత మొత్తంలో నగదు విరాళాన్ని   అందించే వివరాల్ని షారుఖ్‌ఖాన్‌ వెల్లడించలేదు.


logo