షారుఖ్‌ఖాన్ వెండితెరపై కనిపించి మూడేళ్లు అవుతోంది. ‘జీరో’ పరాజయం తర్వాత కథల ఎంపికలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారాయన. తాజా సమాచారం ప్రకారం అగ్ర దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీతో పంతొమ్మిదేళ్ల విరామం తర్వాత షారుఖ్‌ఖాన్ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. భారతీయ వ్యక్తికి, నార్వే మహిళకు మధ్య సాగే ప్రేమ కథ ఇదని తెలిసింది. ఇందులో ప్రియురాలిని అన్వేషిస్తూ సైకిల్‌పై నార్వేకు ప్రయాణం సాగించే ప్రేమికుడిగా షారుఖ్‌ఖాన్ కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాకు ‘ఇజార్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. నిజజీవిత గాథ ఆధారంగా దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఈ కథను సిద్ధం చేసినట్లు తెలిసింది. గతంలో వీరిద్దరి కలయికలో ‘దేవదాస్’ చిత్రం రూపొందింది. అజరామరమైన ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రం అవార్డులతో పాటు కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.