హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడికి సొంతం గా అభివృద్ధి చేస్తున్న ‘కార్బొవ్యాక్స్’ టీకా సామర్థ్యాన్ని పెంచడంపై హైదరాబాదీ దిగ్గజ ఫార్మా సంస్థ బయోలాజికల్-ఈ దృష్టి పెట్టింది. టీకా తయారీలో వినియోగించే ‘సీపీజీ 1018 టీఎం’ అనే సహాయకారిని దిగుమతి చేసుకునేందుకు అమెరికాకు చెందిన డైనావ్యాక్స్తో ఒప్పందం చేసుకున్నది. సీపీజీ 1018 టీఎం అనే రసాయనం టీకాల సామర్థ్యాన్ని పెంచుతుంది. గతంలో దీని ని ‘హెపటైటిస్-బీ’ టీకాల తయారీలో వినియోగించగా, ఉత్తమ ఫలితాలు సైతం కనిపించాయి. ఈ నేపథ్యంలోనే బయోలాజికల్-ఈ తాజా ఒప్పందం చేసుకున్నది. ఈ సందర్భంగా సంస్థ ఎండీ మహిమ దాట్ల స్పందిస్తూ.. డైనావ్యాక్స్తో చేతులు కలుపడం సంతోషంగా ఉన్నదని, దీంతో కరోనా కట్టడికి మరో సమర్థవంతమైన టీకాను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. డైనావ్యాక్స్ సీఈవో ర్యాన్ స్పెన్సర్ మాట్లాడుతూ.. బయోలాజికల్-ఈతో ఒప్పందం ఆనందంగా ఉన్నదని, ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా అన్ని దేశాలకు కార్బొవ్యాక్స్ అందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.