గురువారం 28 జనవరి 2021
Cinema - Nov 10, 2020 , 13:02:49

అఖిల్ హీరోయిన్‌తో రొమాన్స్ చేయ‌నున్న బాలకృష్ణ..

అఖిల్ హీరోయిన్‌తో రొమాన్స్ చేయ‌నున్న బాలకృష్ణ..

బాలయ్య సినిమాల్లో హీరోయిన్ల ఎంపిక ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ఆయన సినిమాల్లో స్టార్ హీరోయిన్స్ ఉండరు. తాను స్క్రీన్ పై ఉంటే స్టార్స్ అవసరం లేదంటాడు బాలయ్య. అందుకే మిగిలిన హీరోల మాదిరి తన సినిమాలో ఈమె ఉండాలి.. ఆమె కావాలని ఎప్పుడూ అడిగింది లేదు. ఇంకా చెప్పాలంటే ఉపాధి హామీ పథకం కింద ఖాళీగా ఉన్న హీరోయిన్లను తీసుకొచ్చి తన సినిమాలో ఛాన్స్ ఇస్తుంటాడు బాలయ్య. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా చాలా మంది ముద్దుగుమ్మల పేర్లు బయటికి వచ్చాయి. కానీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడు ఆ అనౌన్స్‌మెంట్ వచ్చింది. బాలయ్య సినిమాలో అఖిల్ ఫేమ్ సయేషా సైగల్ నటించబోతుంది. ఈ మేరకు చిత్రయూనిట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఈ సెలక్షన్ కాస్త షాకింగ్ గానే ఉంటుంది. 

ఎందుకంటే 60 ఏళ్ల బాలయ్య.. 23 ఏళ్ల సయేషాతో జోడీ కట్టడం అంటే మాత్రం నిజంగానే విడ్డూరంగా అనిపిస్తుంది. ఈ సినిమాలో మొన్నటి వరకు మలయాళ హీరోయిన్ ప్రయాగ మార్టిన్ ను ఎంపిక చేసారని వినిపించింది. అయితే స్క్రీన్ టెస్ట్ చేసిన తర్వాత ఈమె ఎందుకో బాలయ్యకు సరిపోలేదని భావించారు దర్శక నిర్మాతలు. అందుకే ఆమెను కాదని సయేషాను తీసుకున్నారు. అఖిల్ సినిమా తర్వాత తెలుగులో సయేషా మళ్లీ కనిపించలేదు. ఇక్కడ అవకాశాలు కూడా రాలేదు. కానీ ఇదే సమయంలో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ వరస సినిమాలు చేసి స్టార్ అయిపోయింది. చాలా తక్కువ సమయంలోనే కుర్ర హీరోలందరితోనూ నటించింది. 

అదే క్రమంలోనే భలేభలే మగాడివోయ్ రీమేక్ గజినీకాంత్‌లో తనతో పాటు నటించిన ఆర్యను పెళ్లి చేసుకుంది సయేషా. పెళ్ళి తర్వాత కూడా కెరీర్ కొనసాగిస్తుంది. అందులో భాగంగానే అవకాశాలు వచ్చిన ప్రతీసారి ముందుకొస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు కూడా తెలుగులో బాలయ్య సినిమాకు ఓకే చెప్పింది. ఈ సినిమాలో పూర్ణ మరో హీరోయిన్. మరోవైపు హాట్ బ్యూటీ నమిత ఇందులో ప్రతినాయ ఛాయలున్న రాజకీయ నాయకురాలి పాత్రలో కనిపించబోతుంది. మొత్తానికి బాలయ్యతో సయేషా జోడీ ఎలా ఉండబోతుందో చూడాలిక.


logo