తెలుగు చిత్రసీమలో ప్రయోగాత్మక కథాంశాల్ని ఎంచుకుంటూ వైవిధ్యమైన పాత్రలకు చిరునామాగా నిలుస్తున్నారు యువహీరో సత్యదేవ్. ఎలాంటి పాత్రలోనైనా తనదైన విలక్షణ అభినయంతో మెప్పిస్తుంటారాయన. సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘తిమ్మరుసు’. శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు. మహేష్ కోనేరు, సృజన్ నిర్మాతలు. నేడు ప్రేక్షకులముందుకొస్తోంది. ఈ సందర్భంగా గురువారం సత్యదేవ్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివి..
కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ ‘తిమ్మరుసు’ చిత్రాన్ని కేవలం 39రోజుల్లో పూర్తిచేశాం. లాయర్ దృష్టికోణంలో సాగే థ్రిల్లర్ చిత్రమిది. తన శక్తియుక్తులతో ఎలాగైనా న్యాయాన్ని గెలిపించాలని తపించే లాయర్‌గా నా పాత్ర సాగుతుంది. కోర్ట్‌రూమ్ డ్రామాతో పాటు యాక్షన్ ఘట్టాలు కూడా ఉంటాయి. ఇటీవలకాలంలో న్యాయవ్యవస్థ నేపథ్యంలో వచ్చిన ‘వకీల్‌సాబ్’ ‘నాంది’ వంటి చిత్రాలు మంచి విజయాల్ని సాధించాయి. అదే కోవలో ‘తిమ్మరుసు’ ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకం ఉంది. ఇందులో నేను యావజ్జీవ కారాగార శిక్ష అనే పాయింట్‌పై పోరాడే లాయర్‌గా కనిపిస్తాను. తొలుత వినోదప్రధానంగా మొదలైన కథ ఆ తర్వాత సీరియస్‌గా నడుస్తుంది. ‘అభిలాష’ చిత్రంలో చిరంజీవి పాత్ర ఛాయలు నాలో కనిపిస్తాయి. అయితే కథాపరంగా ఆ సినిమాతో ఎలాంటి సంబంధం ఉండదు.
ఆ నమ్మకంతో వస్తున్నాం..
నా కంఫర్ట్‌జోన్ నుంచి బయటికొచ్చి చేసిన సినిమా ఇది. నా పాత్ర చిత్రణ గత చిత్రాలకు పూర్తి వైవిధ్యంగా అనిపిస్తుంది. కరోనా వల్ల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ విలువ పెరిగిపోయింది. నేను నటించిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా ఓటీటీలోనే విడుదలైంది. ప్రస్తుతం కొవిడ్ ప్రభావం తగ్గింది. తొలిదశ కరోనా తర్వాత థియేటర్లో విడుదలైన తెలుగు సినిమాలన్ని మంచి విజయాలు సాధించాయి. ప్రపంచంలోని ఏ సినీ పరిశ్రమలో ఇలా జరగలేదు. ప్రేక్షకులు మరలా థియేటర్‌కు వచ్చి సినిమాలు చూస్తారనే నమ్మకంతోనే కాస్త ఆలస్యమైనా ‘తిమ్మరుసు’ను థియేటర్స్‌లోనే విడుదలచేయాలనుకున్నాం.
ప్రేక్షకులదే తుది నిర్ణయం
కరోనా సమయంలో నేను ఐదు సినిమాల షూటింగ్స్ పూర్తిచేశాను. దాదాపు రెండు వందల రోజులు పనిచేశా. అన్ని జాగ్రత్తలు తీసుకున్నందునే ఆ సినిమాలు చేయగలిగాను. అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ప్రేక్షకులు థియేటర్స్‌లో సినిమాల్ని ఆస్వాదించవొచ్చు. అయితే థియేటర్‌కు రావాలా? వొద్దా? అనే విషయంలో అంతిమ నిర్ణయాన్ని ప్రేక్షకులకు వదిలేస్తే మంచిదని నా అభిప్రాయం.
అన్నీ విభిన్న కథలే..
నేను ఎలాంటి ప్రణాళికలతో సినీరంగంలోకి అడుగుపెట్టలేదు. నాకు సినిమాలంటే విపరీతమైన ప్రేమ. అది నాలో ఉన్నంతకాలం సినిమాలు చేస్తా. ఓరకంగా నా ప్రయాణం ఇప్పుడే మొదలైందని భావిస్తున్నా. ఇప్పుడు నేను విభిన్న కథాంశాలతో నాలుగు సినిమాలు చేస్తున్నాను. కథలు బాగున్నాయి కాబట్టే రీమేక్ సినిమాల్లో నటించా. ప్రస్తుతమైతే రీమేక్ కథలు చేయకూడదనుకుంటున్నా. నేను హిందీలో నటిస్తున్న ‘రామ్‌సేతు’ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఆ సినిమా వివరాలు త్వరలో తెలియజేస్తా.