బుధవారం 05 ఆగస్టు 2020
Cinema - Jul 04, 2020 , 00:09:35

బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ఖాన్‌ మృతి

బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ఖాన్‌ మృతి

  • రెండువేల పాటలకు నృత్యరీతులు
  •  నాయికల ఇమేజ్‌ పెంచిన కొరియోగ్రాఫర్‌
  • మదర్‌ ఆఫ్‌ డ్యాన్స్‌ అస్తమయం
  • విషాదంలో బాలీవుడ్‌

భారతీయ   సినీనృత్యాన్ని విస్తృత జనబాహుళ్యానికి చేరువచేసిన అసమాన ప్రతిభాశాలి సరోజ్‌ఖాన్‌. పామరజనరంజకంగా ఆమె సమకూర్చిన నృత్యరీతులు సినీ ప్రియుల్ని దశాబ్దాల పాటు అలరించాయి. ‘ఏక్‌ దో తీన్‌' ‘చోళీకే పీచే క్యాహై’ వంటి పాటలు నాడు యువతరాన్ని ఉర్రూతలూగించాయి. శ్రీదేవి, మాధురీదీక్షిత్‌ వంటి అగ్రనాయికలకు స్టార్‌హోదాను తీసుకురావడంతో సరోజ్‌ఖాన్‌ అందించిన నృత్యరీతులు కూడా దోహదపడ్డాయి. బాలీవుడ్‌ చిత్రసీమలో సరోజ్‌ఖాన్‌ను ‘మాస్టర్‌జీ’ అని గౌరవంగా సంబోధిస్తారు. దాదాపు 50ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కొరియోగ్రఫీ అందించి మూడుజాతీయ పురస్కారాలను సొంతంచేసుకుందామె. బాలీవుడ్‌ నృత్యానికి నవీన సొబగులద్దిన సరోజ్‌ఖాన్‌ మరణం యావత్‌ భారతీయ చిత్రసీమకు తీరని లోటుగా చెప్పవచ్చు.

‘ది మదర్‌ ఆఫ్‌ డ్యాన్స్‌ ఇన్‌ ఇండియా’గా పేరుగడించిన సరోజ్‌ఖాన్‌ బాలనటిగా వెండితెరపై అడుగుపెట్టింది.  మూడేళ్ల వయసులో ‘నజరానా’ సినిమాలో కథానాయిక శ్యామ చిన్ననాటి పాత్రలో సరోజ్‌ఖాన్‌ నటించింది. ఆ సినిమాతో మొదలైన ఆమె సినీ ప్రస్థానం అప్రతిహతంగా ఐదు దశాబ్దాల పాటు కొనసాగింది. బాల్యంలోనే  నృత్యాల పట్ల సరోజ్‌ఖాన్‌లో మక్కువ మొదలైంది. ఆమె ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ప్రోత్సాహించారు. పదేళ్ల వయసు నుంచి గ్రూప్‌డ్యాన్సర్‌గా సినిమాల్లో పనిచేయడం మొదలుపెట్టింది. డ్యాన్స్‌ పట్ల సరోజ్‌ఖాన్‌లో ఉన్న  తపన, ఇష్టాన్ని గమనించిన కొరియోగ్రాఫర్‌ సొహన్‌లాల్‌ తన సహాయకురాలిగా ఆమెను నియమించుకున్నారు. సొహన్‌లాల్‌ వద్ద అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా చాలా సినిమాలకు పనిచేసిన ఆమె పదమూడేళ్ల వయసులో ‘దిల్‌ హీ తో హై’ సినిమా ద్వారా డ్యాన్స్‌మాస్టర్‌గా మారింది. తన గురువు సొహన్‌లాల్‌ అందుబాటులో లేకపోవడంతో ఆ సినిమాలోని ‘నిగాహే మిల్నే కో జీ చాహా’్త అనే పాటకు సరోజ్‌ నృత్యాలను సమకూర్చింది. అయితే గురువుపై ఉన్న గౌరవంతో తన పేరును టైటిల్స్‌లో వేసుకోలేదు. అలా కొన్ని సినిమాలకు కొరియోగ్రఫీని అందించింది సరోజ్‌ఖాన్‌.  ‘గీతా మేరా నామ్‌' సినిమాతో 1974లో  డ్యాన్స్‌మాస్టర్‌గా బాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన ఆమె సుదీర్ఘ ప్రయాణంలో రెండు వందలకు పైగా సినిమాలకు పనిచేశారు.  బాలీవుడ్‌లో తొలి మహిళా కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ఖాన్‌ కావడం గమనార్హం. 

శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌ చిత్రాలతో..

1983లో సుభాష్‌ఘాయ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘హీరో’ నృత్యదర్శకురాలిగా సరోజ్‌ఖాన్‌కు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత శ్రీదేవి నాయికగా వచ్చిన నగీనా, మిస్టర్‌ ఇండియా, చాందిని సినిమాలతో బాలీవుడ్‌లో సరోజ్‌ఖాన్‌ పేరు మారుమ్రోగిపోయింది.    ‘హవా హవాయి’ ‘ఐ లవ్‌ యూ’ (మిస్టర్‌ ఇండియా), ‘మేరే హాతోమే’(చాందిని), ‘మై తేరా దుష్మన్‌'(నగీనా) ‘నా జానే కహాన్‌' (ఛాల్‌బాజ్‌)తో పాటు శ్రీదేవి నటించిన పలు సినిమాల్లోని పాటలకు సరోజ్‌ఖాన్‌ సమకూర్చిన నృత్యాలు ప్రేక్షకుల్ని అలరించాయి. అనిల్‌కపూర్‌, మాధురీ దీక్షిత్‌ నాయకానాయికలుగా  1988లో విడుదలైన ‘తేజాబ్‌' సినిమాలోని  ‘ఏక్‌ దో తీన్‌..’ పాటకు సరోజ్‌ఖాన్‌ అందించిన నృత్యం దేశవ్యాప్తంగా యువతను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరకాలంలో ‘హమ్‌ కో ఆజ్‌ కల్‌ హై’(సైలాబ్‌), ‘తమ్మా తమ్మా’     (థానేదార్‌), ‘ధక్‌ ధక్‌'(బేటా), ‘ఛోళీ కే పీచే క్యాహై’ (ఖల్‌నాయక్‌), ‘చనే కే ఖేత్‌ మే’(పూర్ణిమ),  ‘మేరా పియా ఘర్‌ అయా’ (యారాన), ‘డోలా రే డోలా’ (దేవదాస్‌)తో పాటు మాధురీ దీక్షిత్‌, సరోజ్‌ఖాన్‌ కాంబినేషన్‌లో వచ్చిన పాటలన్నీ విజయవంతమయ్యాయి. ‘యే కాలీ కాలీ ఆంఖే( బాజీఘర్‌),  ‘చురా కే దిల్‌ మేరా’ (మై ఖిలాడీ తు అనారీ), ‘నింబుడా నింబుడా(హల్‌ దిల్‌ దే చుకే సనమ్‌), ‘యే ఇష్క్‌ హై(జబ్‌ వియ్‌ మెట్‌) పాటలకు సరోజ్‌ఖాన్‌ అందించిన నృత్యాలు అజరామరంగా నిలిచాయి.  పర్‌దేశ్‌, తాళ్‌, సోల్జర్‌,  లగాన్‌, కుచ్‌ నా కహో, వీర్‌జారా, సావరియా, నమస్తే లండన్‌, గురు, లవ్‌ ఆజ్‌ కల్‌, రౌడీ రాథోడ్‌, ఏడీసీడీ, మణికర్ణికతో పాటు పలు విజయవంతమైన సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేసింది సరోజ్‌ఖాన్‌. యాభై ఏళ్ల సినీ ప్రయాణంలో రెండు వేలకుపైగా పాటలకు నృత్యాల్ని అందించారు. జబ్‌ వీ మెట్‌, దేవ్‌దాస్‌, శ్రింగారం(తమిళం) చిత్రాలకుగాను కొరియోగ్రాఫర్‌గా జాతీయ పురస్కారాలను దక్కించుకున్నారు. చివరగా 2019లో  రూపొందిన ‘కలంక్‌' సినిమాకు నృత్యాల్ని అందించారామె. 

తెలుగులో ‘చూడాలని ఉంది’

తెలుగులో చిరంజీవి కథానాయకుడిగా గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘చుడాలని వుంది’ సినిమాలోని రెండు పాటలకు సరోజ్‌ఖాన్‌ నృత్యాల్ని సమకూర్చారు.  ఈ చిత్రానికి నంది అవార్డును అందుకున్నారు. దేవీపుత్రుడు, డాడీ, అంజి, టక్కరిదొంగ, సుభాష్‌చంద్రబోస్‌, ఆటతో పాటు టాలీవుడ్‌లో పలు సినిమాలకు డ్యాన్స్‌మాస్టర్‌గా పనిచేసి తనదైన ముద్రను వేశారు. తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఇరువర్‌'తో పాటు ఎన్నో విజయవంతమైన సినిమాలకు డ్యాన్స్‌మాస్టర్‌గా పనిచేశారు సరోజ్‌ఖాన్‌.

రచయితగా..

కొరియోగ్రాఫర్‌గానే కాకుండా రచయితగా ప్రతిభను చాటుకున్నారు సరోజ్‌ఖాన్‌. చోటే సర్కార్‌, దిల్‌ తేరా దివానా, ఖిలాడీ, వీరు దాదాతో పాటు పలు చిత్రాలకు కథల్ని అందించారు.  రియాలిటీ షోస్‌కు న్యాయనిర్ణేతగా పనిచేశారు. సరోజ్‌ఖాన్‌ అసలు పేరు నిర్మలా నాగ్‌పాల్‌. ఇస్లాం మతాన్ని స్వీకరించిన ఆమె సరోజ్‌ఖాన్‌గా తన పేరును మార్చుకున్నారు.  తనకు నృత్యంలో గురువైన సొహన్‌లాల్‌ను పదమూడో ఏట వివాహమాడింది. ఆ సమయంలో సొహన్‌లాల్‌ వయసు 41. అప్పటికే పళ్లై అతడికి నలుగురు పిల్లలున్నారు. దాంతో  బాలీవుడ్‌లో వీరి వివాహం వివాదస్పదంగా మారింది. అయితే సొహన్‌లాల్‌ పట్ల ఆమెకు అమితమైన ప్రేమానురాగాలుండేవి. ఇతర డ్యాన్సర్స్‌తో సొహన్‌ కలిసి ఉండటం తనను అసూయకు గురిచేసేదని సరోజ్‌ఖాన్‌ ఓ సందర్భంలో చెప్పింది. 1965లో సొహన్‌లాల్‌ నుంచి విడిపోయింది సరోజ్‌ఖాన్‌. ఆ తర్వాత  సర్దార్‌ రోషన్‌ఖాన్‌ను వివాహమాడింది. సరోజ్‌ఖాన్‌కు ముగ్గురు పిల్లలున్నారు. వీరిలో రాజుఖాన్‌ బాలీవుడ్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతున్నారు. 

 సీఎం కేసీఆర్‌ సంతాపం

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ఖాన్‌ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు  తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సరోజ్‌ ఖాన్‌ మృతి సినిమా పరిశ్రమకు తీరని లోటన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు.


logo