Samantha | వైవిధ్య భరిత పాత్రలను ఎంచుకుంటూ తన నటన, అందంతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత. ‘ఏమాయ చేశావే’ సినిమాతో ప్రేక్షకులను మాయ చేసిన సమంత ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం సౌత్ ఇండియాలోని టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. అంతేకాకుండా అత్యధిక పారితోషికం అందుకుంటున్న సౌత్ కథానాయికలలో కూడా సమంత ముందు వరుసలో ఉంది. ఇక ఈమె ఏడాదికి రెండు, మూడు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత సినిమాలలో మరింత జోరును ప్రదర్శిస్తుంది. అయితే తాజాగా సమంత ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది.
అమేజాన్ సంస్థ తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్‌లో సమంత పోషించిన రోల్‌కు ప్రేక్షకుల నుంచి క్రిటిక్స్ వరకు గొప్ప ప్రశంసలు దక్కాయి. అంతేకాకుండా ఈ వెబ్‌సిరీస్‌తో సమంతకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా ఈమె నటనకు గాను ఉత్తమ నటి అవార్డును అందుకుంది. క్రిటిక్స్ ఛాయిస్ సంస్థ ఈ అవార్డును అందించింది. ఈ అవార్డు పట్ల సమంత సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో అవార్డుతో దిగిన ఫోటోను షేర్ చేసింది. ఈ అవార్డు అందుకోవడంతో పలువురు సినీప్రముఖులు సమంతకు అభినందనలు తెలుపుతున్నారు.