గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 06, 2020 , 00:29:47

కలలకు ప్రతిబింబం

కలలకు ప్రతిబింబం

అక్కినేని వారి ఇంటికోడలు సమంత వస్త్ర వ్యాపారంలోకి అడుగు పెట్టింది. సరికొత్త ఫ్యాషన్‌ ప్రపంచాన్ని ఆవిష్కరించే వస్త్ర బ్రాండ్‌ ‘సాకీ’ని లాంచ్‌ చేసింది. తన వస్త్ర వ్యాపారాన్ని సోషల్‌ మీడియా వేదికగా శనివారం అందరికి పరిచయం చేసింది. సాకీ పేరుతో మహిళల ఫ్యాషన్‌ దుస్తులను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది. సరికొత్తగా కనిపించాలనుకోవడం అందరికి చాలా ఇష్టమని.. అందుకు తగినట్లుగానే సాకీ బ్రాండ్‌ అందుబాటులో ఉంటుందని వివరించింది. కాలేజీ అమ్మాయిలు, మహిళలు ప్రతి ఒక్కరిని ఫ్యాషన్‌ ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ‘సాకీ’ డిజైన్స్‌ ఉంటాయని పేర్కొంది. మిస్‌ ఇండియా-2016 ఫస్ట్‌ రన్నరప్‌ సుశృతి కృష్ణ, సమంత ఫౌండర్లుగా సాకీ బ్రాండ్‌ను తీసుకొచ్చారు. సరికొత్త డిజైన్‌లతో ఆకట్టుకునే వస్ర్తాలను విక్రయించనున్నట్టు తెలిపారు. మహిళలు ముఖ్యంగా తాము ధరించే వస్ర్తాలు చాలా ప్రత్యేకంగా ఉండాలనుకుంటారని.. అలాంటి అంచనాలకు తగ్గట్టుగా సాకీ నిలుస్తుందని చెప్పారు. తన కలలకు ప్రతిబింబం ఈ సాకీ అంటూ సమంత ట్విట్టర్‌లో పేర్కొంది.


logo