గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 15, 2020 , 00:07:15

సారీ రకుల్‌ అంటున్న నెటిజన్లు

సారీ రకుల్‌ అంటున్న నెటిజన్లు

సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు దర్యాప్తులో డ్రగ్స్‌ కోణం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) సుశాంత్‌సింగ్‌ ప్రేయసి రియా చక్రవర్తి,  ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తితో పాటు మరికొందరిని జ్యుడీషియల్‌ కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా రియా చక్రవర్తి దర్యాప్తు ఆధికారులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో 25 మంది బాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు వెల్లడించిందని ప్రచారం జరిగింది. త్వరలో వారందరికి ఎన్‌సీబీ నోటీసులు జారీ చేయబోతుందని జాతీయ పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ సెలబ్రిటీల్లో అగ్ర కథానాయికలు రకుల్‌ప్రీత్‌సింగ్‌, సారా అలీఖాన్‌ పేర్లు ఉన్నట్లు వార్తలొచ్చాయి. దీంతో సోషల్‌మీడియా వేదికగా రకుల్‌ప్రీత్‌సింగ్‌పై ట్రోలింగ్‌ మొదలైంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్‌సీబీ డైరెక్టర్‌ కేపీఎస్‌ మల్హోత్రా ఓ కీలక ప్రకటన చేశారు. బయట ప్రచారం జరుగుతున్నట్లుగా తాము బాలీవుడ్‌ ప్రముఖుల జాబితాను సిద్ధం చేయలేదని, మాదక ద్రవ్యాల ముఠా, సప్లయర్స్‌ను మాత్రమే గుర్తించామని తెలిపారు. బాలీవుడ్‌ ప్రముఖులు ఉన్నారంటూ వస్తున్న వార్తలు పుకార్లేనని పేర్కొన్నారు. తాము గుర్తించిన వారిలో రకుల్‌, సారాఅలీఖాన్‌ పేర్లు లేవని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో నెటిజన్లు రకుల్‌ప్రీత్‌సింగ్‌, సారా అలీఖాన్‌పై సానుభూతిని వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. వాస్తవాల్ని విశ్లేషించకుండా అనవసరంగా వారిపై విమర్శలు చేశామని చింతిస్తున్నారు. ‘సారీ      రకుల్‌' ‘సారీసారాఅలీఖాన్‌' అనే హ్యాష్‌ట్యాగ్‌లు ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. పలువురు బాలీవుడ్‌, టాలీవుడ్‌ సెలబ్రిటీలు రకుల్‌, సారాలకు మద్దతుగా నిలుస్తున్నారు. అగ్ర కథానాయిక సమంత రకుల్‌ప్రీతిసింగ్‌, సారాఅలీఖాన్‌ పక్షాన నిలిచింది. ట్రోలర్స్‌ అందరి తరపున తాను రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు క్షమాపణలు చెబుతున్నానని ప్రకటించింది. అయితే డ్రగ్స్‌ వ్యవహారంలో తన పేరు వినిపిం చడంపై రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఇప్పటి వరకు స్పందించలేదు.logo