శనివారం 08 ఆగస్టు 2020
Cinema - Jul 12, 2020 , 23:39:21

లాక్‌డౌన్‌ సవాళ్లు

లాక్‌డౌన్‌ సవాళ్లు

సాధారణంగా కథానాయికలు సినిమా షూటింగ్‌లు, ప్రమోషన్‌లతో తీరిక లేకుండా గడుపుతుంటారు.  బిజీ షెడ్యూల్స్‌లో ఏ మాత్రం విరామం దొరికినా కొత్త ఫొటోషూట్‌లతో అందాలను ఒలకబోస్తుంటారు. కరోనా వ్యాప్తితో గత మూడు నెలలుగా షూటింగ్‌లకు బ్రేక్‌ పడటంతో హీరోయిన్లు ఇంటికే పరిమితమయ్యారు. ఈ విరామంలో సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో నిరంతరం టచ్‌లో  ఉంటున్నారు. పాత సినిమాల జ్ఞాపకాల్ని, గత ఫొటోషూట్‌ల తాలూకు  చిత్రాల్ని అభిమానులతో పంచుకుంటున్నారు. మరికొందరు తారలు మాత్రం వ్యక్తిగత అభిరుచులకు పదునుపెడుతూ వంటల్లో తమ ప్రావీణ్యాన్ని చాటుతూ బిజీగా గడిపారు. 

సమంత వ్యవసాయం

లాక్‌డౌన్‌ టైమ్‌లో  చెఫ్‌గా అవతారమెత్తింది పూజాహెగ్డే.  కొత్త వంటకాలతో పాకశ్రాస్త్రంలో ప్రావీణ్యాన్ని చాటుకుంది. ఇండియన్‌, విదేశీ వంటల్ని స్వయంగా సిద్ధం చేసింది.  ఆ రెసిపీలతో పాటు వంట చేస్తున్న వీడియోల్ని, ఫొటోల్ని అభిమానులతో పంచుకుంది. బరువు తగ్గడంపై దృష్టిసారించిన కీర్తిసురేష్‌ ఈ గ్యాప్‌ను పరిపూర్ణంగా వినియోగించుకున్నది. వర్కవుట్స్‌తో సన్నజాజిలా మారిపోయింది.  వయోలిన్‌ నేర్చుకున్నట్లు తెలిపింది. ‘కాలేజీ రోజుల్లో వయోలిన్‌ నేర్చుకున్నా. సాధన లేకపోవడంతో ఈ కళను మర్చిపోయా. మళ్లీ ఇన్నాళ్లకు వయోలిన్‌ సాధన చేసే అవకాశం దొరికింది’ అని కీర్తి సురేష్‌ తెలిపింది. ఈ విరామంలో గిటార్‌ పాఠాల్ని నేర్చుకున్నది రాశీఖన్నా. గిటార్‌ ప్లే చేయడం ఇష్టమని, మెళకువల్ని నేర్చుకునే సమయం దొరకడం ఆనందంగా ఉందని చెప్పింది.  లాక్‌డౌన్‌ టైమ్‌లో  సమంత అర్బన్‌ వ్యవసాయం చేసింది. తన ఇంటినే వ్యవసాయక్షేత్రంగా మార్చుకున్న ఆమె ఆకుకూరలతో పాటు కూరగాయల్ని పండిస్తోంది. తనకెంతో సంతోషాన్నిచ్చే వ్యాపకమిదని సమంత పేర్కొన్నది.  ‘ఇస్మార్ట్‌భామ’ నిధి అగర్వాల్‌ ఆన్‌లైన్‌ యాక్టింగ్‌ పాఠాల్ని నేర్చుకుంది. అంతేకాదు కొత్త భాషలపై పట్టు సాధించింది.


logo