నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలలో క్రేజీ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయన. ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో అలరించడంతో దీనికి సీక్వెల్‌గా ఉంటుంది అని ఎప్పటి నుండో వార్తలు వినిపిస్తున్నాయి. బంగార్రాజు అనే టైటిల్‌తో సీక్వెల్ తెరకెక్కనుందని కొద్ది రోజుల క్రితం క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇక అప్పటి నుండి మూవీకి సంబంధించి అనేక ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి. ఈ చిత్రం తాత, మనవళ్ల మధ్య సాగే స్టోరీగా ఉంటుందని తెలుస్తుండగా, ఇందులో నాగార్జున, అఖిల్ తాత మనవళ్లుగా నటిస్తారట.
ఇక నాగ చైతన్య కూడా బంగార్రాజు చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో చైతన్య జోడిగా ఆయన భార్య, స్టార్ హీరోయిన్ సమంత నటించనున్నట్లు తెలుస్తోంది. రియల్ లైఫ్‌లో మాదిరిగానే బంగార్రాజు(నాగార్జున) కొడుకు-కోడలుగా ఈ జంట సందడి చేయనుందట. మొత్తానికి అక్కినేని ఫ్యామిలీ అందరితో మనం స్టైల్లో ఈ సినిమాను ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని సమాచారం. కాగా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్లో నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రా షూటింగ్ జూన్, జూలైలో ప్రారంభం కానుందట.