శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 14, 2020 , 16:49:46

శ్రావ‌ణి ఆత్మ‌హ‌త్య కేసు.. ఇద్ద‌రు నిందితులు అరెస్ట్

శ్రావ‌ణి ఆత్మ‌హ‌త్య కేసు.. ఇద్ద‌రు నిందితులు అరెస్ట్

హైద‌రాబాద్ : బుల్లి తెర న‌టి శ్రావ‌ణి ఆత్మ‌హ‌త్య కేసులో ఇద్ద‌రు నిందితుల‌ను అరెస్టు చేసిన‌ట్లు సౌత్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ మీడియాకు వెల్ల‌డించారు. ఈ కేసులో సాయి కృష్ణారెడ్డిని ఏ1గా, అశోక్ రెడ్డిని ఏ2గా, దేవ‌రాజ్ రెడ్డిని ఏ3గా గుర్తించామ‌న్నారు. ఇవాళ సాయికృష్ణారెడ్డి, దేవ‌రాజ్‌ను అరెస్టు చేశామ‌ని, త్వ‌రలోనే అశోక్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిస్తామ‌న్నారు. అరెస్టు అయిన ఇద్ద‌రు నిందితుల‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని డీసీపీ తెలిపారు. 

ఈ కేసులో శ్రావ‌ణి త‌ల్లిదండ్రుల‌ను నిందితులుగా చేర్చ‌డానికి కుద‌ర‌దు అని స్ప‌ష్టం చేశారు. ముగ్గురు ఏదో ఒక సంద‌ర్భంలో ఆమెను పెళ్లి చేసుకుంటామ‌ని న‌మ్మించారు. ఆ త‌ర్వాత యువ‌తిని ప‌లు విధాలుగా వేధించి హింసించారు. అయితే ఈ ముగ్గురు నిందితుల బాధ‌లు భ‌రించ‌లేక‌నే శ్రావ‌ణి ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని భావిస్తున్నామ‌ని డీసీపీ పేర్కొన్నారు. చ‌నిపోవ‌డానికి ముందు దేవ‌రాజ్‌తో చాలా సేపు మాట్లాడిన‌ట్లు కాల్ రికార్డు ద్వారా తెలిసింది. గ‌తంలో త‌న‌ను వెంటాడి వేధిస్తున్న‌ట్లు దేవ‌రాజ్ పై శ్రావ‌ణి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది అని డీసీపీ తెలిపారు.