ఇంటి ముందున్న ధ్వజస్తంభం లాంటి
చెట్టు దేవతలకు చేతులెక్కి మొక్కాలి
పూల పండుగ కోలాహలంలో తడిసే
ప్రకృతి ప్రేమికుల పరిమళతత్వాన్ని
హృదయ పూర్వకంగా మెచ్చుకొని తీరాలె
నేలకు వర్ణశోభిత చీర సారెల్ని
సమర్పించే వారసత్వ బంధువులను
అడిగినట్లు చెప్పాలె
ఫలాల్ని కాంక్షించే ప్రతి ఒక్కరు
ఆకుపచ్చని క్షేత్రాలకై శ్రమగానం చెయ్యాలె
వాడ వాడన, ఊరు ఊరున
పర్యావరణ శోభను సమకూర్చే
కృషీవలులను అభినందించి తీరాలె
అడుగడుగున చెట్లు నాటితె
భవిత వెన్నంటే ఉంటుందని
భరోసా ఇవ్వాలె
వర్తమానాన్ని చేతబట్టుకొని
జీవన క్షేత్రాల్లో చెమట విత్తులు నాటుతుండాలె
హరిత స్వప్నాలను కలగనే
పుణ్య పురుషుల గొప్పతనాన్ని కీర్తించాలె
ఆకుపచ్చని అవకాశాల్ని శోధించుకొని
ధరణిని అందంగ అలంకరించుకుందామని
అందరం మాట ఇవ్వాలె
అశోకుడు నాటిన చరిత
ప్రగతి పంట పండిస్తుందని,
పరధ్యాసలో వుంటె మనిషికి మనుగడే లేదని
హెచ్చరికలు జారీ చేస్తుండాలె
–వనిపాకల లచ్చిరెడ్డి
9966897001