‘చాలా రోజుల తర్వాత మా సంస్థలో వస్తున్న యూత్‌ఫుల్ సినిమా ఇది. టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌తో ఉన్న అనుబంధం కారణంగా ఆయన్నే స్వరకర్తగా తీసుకున్నాం. కథానుగుణంగా అద్భుతమైన బాణీలను అందించాడు’ అని అన్నారు అగ్ర నిర్మాత దిల్‌రాజు. స్వీయ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తన సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ దిల్‌రాజు నిర్మించిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. సోమవారం టీజర్‌ను విడుదల చేశారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘మా సంస్థ ప్రయాణంలో ఈ సినిమాను ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నాం. తొలిపాట విడుదలైన తర్వాత ఆశిష్ డ్యాన్స్ బాగా చేశాడనే ప్రశంసలొచ్చాయి. ఈ సినిమాకు ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల టీమ్ కుదిరింది. దసరాకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఈ సినిమాలోని తొమ్మిది పాటలు ప్రేక్షకులకు కన్నులపండువగా ఉంటాయని, దేవిశ్రీప్రసాద్‌తో పనిచేయడంతో తన కల నెరవేరినట్లయిందని దర్శకుడు తెలిపారు. దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ ‘ఈ సినిమాకు మ్యూజిక్ ఇవ్వడం ఓ బాధ్యతగా భావించా. ప్రతి ఒక్కరికి వారి కాలేజీరోజుల్ని గుర్తుకుతెచ్చే సినిమా ఇది. ఆశిష్ అద్భుతమైన నటనను కనబరిచాడు. అతను హీరోగా విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని చెప్పారు. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా సినిమా ఆకట్టుకుంటుందని హీరో ఆశిష్ పేర్కొన్నారు.