‘నేటి యువత ఆకర్షణనే ప్రేమ అని అనుకుంటున్నారు. అందుకే త్వరగా విడిపోతున్నారు. ప్రేమ, ఆకర్షణకు మధ్య ఉండే సందిగ్ధతను ఈ సినిమాలో చర్చించాం’ అన్నారు అనిల్ పాదురి. ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘రొమాంటిక్’. ఆకాష్‌పూరి, కేతికాశర్మ జంటగా నటించారు. పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మాతలు. ఈ నెల 29న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా ఆదివారం దర్శకుడు అనిల్ పాదురి పాత్రికేయులతో ముచ్చటించారు.
వీఎఫ్ఎక్స్ నేపథ్యం నుంచి..
మా స్వస్థలం పాలకొల్లు. సినీరంగంలోకి రాకముందు వీఎఫ్ఎక్స్ విభాగంలో పనిచేశా. కల్యాణ్‌రామ్‌తో కలిసి ఓ వీఎఫ్ఎక్స్ కంపెనీ ప్రారంభించాను. ఎన్టీఆర్ ‘టెంపర్’ సినిమాకు పనిచేశాను. అప్పుడే పూరి జగన్నాథ్‌తో పరిచయమేర్పడింది. ఆ తర్వాత ఆయనతో ప్రయాణం సాగించాను. ‘రొమాంటిక్’ కథను పూరి జగన్నాథ్ అందించారు. ఆద్యంతం ఎమోషనల్‌గా సాగే ప్రేమకథ ఇది. ప్రేమపై ఏమాత్రం నమ్మకం లేని యువకుడు ప్రేమలో పడితే ఏం జరిగిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. యువతను మాత్రమే కాకుండా కుటుంబ ప్రేక్షకుల్ని కూడా మెప్పిస్తుంది.
పూరి ప్రోత్సహించారు..
ఈ సినిమాకు పూరి జగన్నాథ్ కథ, మాటలు అందించినప్పటికీ నాదైన శైలిలో తెరకెక్కించాను. అయితే దర్శకుడిగా ఆయన ప్రభావం నాపై చాలా ఉంది. ఈ సినిమా విషయంలో పూరి జగన్నాథ్ ఎంతగానో ప్రోత్సహించారు. సినిమా చూపించినప్పుడు ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. “అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమాలో కంటే ఇందులో ఎక్కువ ఎమోషన్ ఉంది. దర్శకుడిగా నీకు మంచి భవిష్యత్తు ఉంది’ అని ఆయన మెచ్చుకున్నారు. సెన్సార్‌వారు కూడా సినిమా బాగుందని ప్రశంసించారు. ఆకాష్ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. సంభాషణలు అద్భుతంగా చెప్పాడు. నాకు కమర్షియల్ కథలంటేనే ఇష్టం. తదుపరి సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో చేస్తున్నా.