సోమవారం 03 ఆగస్టు 2020
Cinema - Mar 28, 2020 , 14:46:31

సాయంత్రం స‌మ‌యంలో లిక్క‌ర్ స్టోర్స్ తెర‌వండి: సీనియ‌ర్ న‌టుడు

సాయంత్రం స‌మ‌యంలో లిక్క‌ర్ స్టోర్స్ తెర‌వండి: సీనియ‌ర్ న‌టుడు

క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకి త‌న ప్ర‌తాపం చూపిస్తూ ప్ర‌పంచాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మ‌న‌దేశంలోను క‌రోనా పాజిటివ్ కేసులు క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతున్న నేప‌థ్యంలో ముంద‌స్తు చ‌ర్య‌గా కేంద్ర ప్ర‌భుత్వం లాక్ డౌన్ ప్ర‌క‌టించింది. దీంతో నిత్యావ‌స‌ర వ‌స్తువులు త‌ప్ప ఏవి ప్ర‌జ‌ల‌కి అందుబాటులో లేకుండాపోయాయి. సినిమాలు, షూటింగ్స్‌, మాల్స్‌, ప‌బ్స్ వంటి విలాస‌వంత‌మైన  ప్రదేశాలు మూత‌ప‌డ‌డంతో జ‌నాలు ఇళ్ళ‌ల్లో కూర్చొని బిక్కుబిక్కుమంటూ కాలం గ‌డుపుతున్నారు.

ఇటీవ‌ల కొందరు మందుబాబులు మ‌ద్యం లేక విల‌విల‌లాడుతూ కొద్ది సేపు అయిన లిక్క‌ర్ స్టోర్స్ తెర‌వాల‌ని డిమాండ్స్ చేశారు. వీరికి మ‌ద్దతుగా బాలీవుడ్ న‌టుడు రిషి క‌పూర్ చేరారు. తాజాగా త‌న ట్వీట్స్‌లో ..రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కి ఎక్సైజ్ శాఖ నుండి డ‌బ్బు అవ‌స‌రం. అందుకోసం కొంత కాలం లైసెన్స్ పొందిన మ‌ద్యం దుకాణాల‌ని సాయంత్రం స‌మ‌యంలో తెర‌వాలి. ఈ విష‌యంలో న‌న్ను తిట్ట‌వ‌ద్దు. మ‌నిషి ఇంట్లో ఉంటాడు. చుట్టూ అనిశ్చితి,నిరాశ‌లో ఉంటాడు. ఇలాంటి స‌మ‌యంలో పోలీసులు, వైద్యులు, పౌరుల‌కి మ‌ద్యం అవ‌స‌రం. బ్లాక్‌లో అయిన  మ‌ద్యం అమ్మే ఏర్పాట్లు చేయండని రిషి క‌పూర్ స‌ల‌హా ఇచ్చారు. ఎప్పుడు వివాదాల‌తో వార్త‌లలోకి ఎక్కే రిషి క‌పూర్ తాజాగా మ‌రో వివాదంతో హాట్ టాపిక్‌గా మారాడు.


logo