మంగళవారం 01 డిసెంబర్ 2020
Cinema - Jun 22, 2020 , 14:56:01

సుశాంత్ ప్రేయ‌సి చుట్టూ బిగుస్తున్న‌ ఉచ్చు..!

సుశాంత్ ప్రేయ‌సి చుట్టూ బిగుస్తున్న‌ ఉచ్చు..!

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ మృతి ఇంకా మిస్ట‌రీగానే మారింది. బంధుప్రీతి వ‌ల‌న అత‌ను మృతి చెందాడా లేక ప్రేమ విఫ‌లం వ‌ల‌న డిప్రెష‌న్‌కి లోనై సూసైడ్ చేసుకున్నాడా అనే దానిపై ద‌ర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇటీవ‌ల సుశాంత్ మ‌ర‌ణానికి ఆయ‌న ప్రియురాలే కార‌ణ‌మ‌ని బీహార్‌లోని ముజ‌ఫ‌ర్‌పూర్ కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేసారు ఓ న్యాయ‌వాది. ఇక ప‌తాహీ ప్రాంతానికి చెందిన కుంద‌న్ కుమార్ అనే వ్య‌క్తి కూడా రియా చ‌క్ర‌వర్తిపై ఆరోప‌ణ‌లు చేస్తూ ప‌తాహాలోని స్థానిక కోర్ట్ లో పిటీష‌న్ వేశారు.

బంధుప్రీతి వ‌ల‌ననే ఆయ‌న చ‌నిపోయాడ‌ని ఆ మ‌ధ్య పిటీష‌న్ వేసిన కుంద‌న్ తాజాగా రియా వ‌ల‌న సుశాంత్ క‌న్నుమూసాడ‌ని పిటీష‌న్‌లో పేర్కొన్నారు. సుశాంత్ ఆమె వ‌ల‌న మాన‌సికంగా ఒత్తిడికి గుర‌య్యాడు. అతని ద‌గ్గ‌ర నుండి ఆమె భారీ డబ్బు దోపిడి చేసింద‌ని త‌న పిటీష‌న్‌లో పేర్కొన్నాడు. జూన్ 24న దీనిపై విచార‌ణ జ‌ర‌గ‌నుంది. కుందన్‌.. సుశాంత్‌కి వీరాభిమాని కాగా, ఆయ‌న మృతితో కుంద‌న్ తీవ్ర ఆందోళ‌న‌కి గుర‌య్యాడు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌  2009లో హిందీలో ప్రారంభమైన పవిత్ర రిశ్తా ( పవిత్ర సంబంధం) అనే టీవీ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఏక్తా కపూర్ నిర్మించిన ఈ సీరియల్‌లో సుశాంత్ ప్రధాన పాత్ర పోషించి టీవీ ఆడియెన్స్‌ని మెప్పించాడు. ఇదే సీరియల్‌లో తనకి జోడీగా నటించిన అంకిత లోఖండేతో సుశాంత్‌ ప్రేమలో పడ్డాడు. దాదాపు ఆరేళ్లపాటు వీళ్ల ప్రేమాయణం కొనసాగింది. 2016లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ -  అంకిత లోఖండే ఒకరికొకరు బ్రేకప్ చెప్పుకున్నారు. అప్పటికే సినిమాల‌తో బిజీగా ఉన్న సుశాంత్ వేరే న‌టితో డేటింగ్‌లో ఉన్నాడ‌ని, అంకిత త‌న‌కి ద‌గ్గ‌రి వ్య‌క్తితో నిశ్చితార్ధం జ‌రుపుకుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది.