e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 16, 2021
Home News Republic Movie Review | రిపబ్లిక్‌ సినిమా రివ్యూ

Republic Movie Review | రిపబ్లిక్‌ సినిమా రివ్యూ

Republic Movie Review

Republic Movie Review ( రిపబ్లిక్‌ సినిమా రివ్యూ ) | రాజకీయ నేపథ్య కథాంశాలతో సినిమాల్ని తెరకెక్కించే ట్రెండ్‌ తెలుగులో కొంత తక్కువేనని చెప్పుకోవచ్చు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పొలిటికల్‌ కథల్ని అర్థవంతంగా తెరకెక్కించవచ్చని ప్రస్థానం సినిమాతో దర్శకుడు దేవా కట్టా నిరూపించారు. ఆ పంథాలోనే మరోసారి సమకాలీన రాజకీయ వ్యవస్థలోని లోతుపాతుల్ని ఆవిష్కరిస్తూ ఆయన రూపొందించిన తాజా చిత్రం ‘రిపబ్లిక్‌’. సాయి ధరమ్‌ తేజ్‌ ( Sai Dharam Tej ) ఈ సినిమాలో హీరోగా నటించాడు. లాక్‌డౌన్‌ కారణంగా సినిమా వాయిదా పడటం, విడుదలకు ముందు సాయిధరమ్‌తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురవ్వడం.. ఎలా ఎన్నో అవంతరాల్ని దాటుకుంటూ ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈసినిమా ద్వారా దేవా కట్టా కమర్షియల్‌ సక్సెస్‌ను అందుకోగలిగాడా? తన పంథాకు భిన్నంగా సాయిధరమ్‌తేజ్‌ చేసిన ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించగలిగిందా?లేదా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ ఏంటంటే..

కళ్ల ముందు అన్యాయం జరిగితే సహించని మనస్తత్వం అభిరామ్‌ది(సాయిధరమ్‌తేజ్‌). ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసే తండ్రి దశరథ్‌(జగపతిబాబు) లంచాలు తీసుకోవడం నచ్చకపోవడంతో అతడిని ద్వేషిస్తుంటాడు. చదువును పూర్తిచేసుకొని అమెరికా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న అభిరామ్‌ ఓ ఐఏఎస్‌ అధికారితో జరిగిన గొడవలో తన ఆలోచనను మార్చుకుంటాడు. వ్యవస్థలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్స్‌ రాసి కలెక్టర్‌గా ఎంపిక అవుతాడు. తన రాజకీయబలంతో తెల్లేరు సరస్సును ఆక్రమించుకొని కొన్ని ఏళ్లుగా ఆ ప్రాంతంపై ఆధిపత్యం చెలాయిస్తుంటుంది విశాఖవాణి(రమ్యకృష్ణ). తనకు ఎదురు తిరిగిన వారందనిని చంపిస్తుంటుంది. విశాఖవాణికి భయపడిన ప్రభుత్వాధికారులందరూ ఆమె చెప్పినట్లుగా వింటుంటారు. విశాఖవాణి చేస్తున్న అక్రమాల్ని వెలుగులోకి తీసుకురావడానికి అభిరామ్‌ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? అతడి లక్ష్యసాధనలో ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి?నిజాయితీకి విలువనిచ్చే అభిరామ్‌ తండ్రి దశరథ్‌ ఎందుకు అవినీతి పరుడిగా మారాడు?రాజకీయ కుట్రలకు బలైన మైరా హాండ్సన్‌(ఐశ్వర్యరాజేష్‌)కు అభిరామ్‌ ఎలా అండగా నిలిచాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.

ఎలా ఉంది?

- Advertisement -

శానన, న్యాయ, పాలన వ్యవస్థలు సక్రమంగా పనిచేసినప్పుడే ప్రజాస్వామం బాగుంటుంది. ఈ మూడింటిలో ఏది గాడితప్పినా దాని తప్పుల్ని సరిదిద్దాల్సిన బాధ్యత మిగతా వ్యవస్థలపై ఉంటుందనే పాయింట్‌తో దర్శకుడు దేవా కట్టా ఈ కథ రాసుకున్నారు. తమకున్న అపరిమితమైన అధికారాలతో రాజకీయ నాయకులు మిగతా ప్రభుత్వ అధికారులను, న్యాయ వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తున్నారో, ఈ సినిమాలో చూపించారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్నా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రభుత్వ అధికారులు తమ మనస్సాక్షిగా విరుద్ధంగా ఎలా పనిచేస్తున్నారో చూపించే ప్రయత్నం చేశారు. రాజకీయాల పట్ల ప్రజల్లో ఉన్న అజ్ఞానాన్ని పావులుగా వాడుకుంటూ తమస్వార్థ ప్రజయోజనాల కోసం నాయకులు వారిని ఎలా బలిపశువులను చేస్తారనే పాయింట్‌ను కమర్షియల్‌ పంథాలో చెప్పేందుకు కృషిచేశారు. అయితే తాను ఎంచుకున్న కథా పరిధి చాలా పెద్దది కావడంతో దేవా కట్టా కొంత మేర మాత్రమే ఈ ప్రయత్నంలో విజయవంతమయ్యారు.

సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని చూసి అభిరామ్‌ చలించిపోయే సన్నివేశాలతో ప్రథమార్థాన్ని అల్లుకున్నారు దేవా కట్టా. ఆ అక్రమాల్ని అడ్డుకునే అధికారం లేకపోవడంతో నిస్సహాయుడిగా ఉండిపోయినట్లుగా చూపించే సన్నివేశాల్లో నిడివి ఎక్కువైన భావన కలుగుతుంది. కలెక్టర్‌గా అతడు ఎంపికైన తర్వాతే అసలు కథను మొదలుపెట్టారు. విశాఖవాణి రాజకీయ బలానికి కలెక్టర్‌ అధికారానికి మధ్య జరిగే సంఘర్షణతో ద్వితీయార్థం పోటాపోటీగా ఉంటుందని భావించిన ప్రేక్షకులకు కథను తెల్లేరు సరస్సు వైపుకు తిప్పి కొత్త ట్విస్ట్‌ ఇచ్చారు దర్శకుడు. తెల్లేరు ఆక్రమణ, కాలుష్య ప్రభావం అంటూ వచ్చే ప్రధాన పాయింట్‌ ఆకట్టుకోదు. ఆ సరస్సును విశాఖవాణి ఆధిపత్యం నుంచి విడిపించేందుకు అభిరామ్‌ చేసే పోరాటాన్ని కేవలం సంభాషణల ప్రధానంగానే నడిపించారు. డైలాగ్‌లు అర్థవంతంగానే ఉన్నా అవి ప్రేక్షకుల్ని కథలో లీనమయ్యేలా ఎంగేజ్‌ చేయగలవా అన్నది అనుమానమే.వాటిలో కొన్ని సన్నివేశాల్ని మాత్రమే బలంగా తీర్చిదిద్దారు. ఆ సరస్సు సమస్యతో హీరోయిన్‌ కథను లింక్‌ చేసిన విధానం బాగుంది. తండ్రీ కొడుకుల సంఘర్షణను అర్థవంతంగా చూపించారు. పతాక ఘట్టాల్ని ప్రేక్షకుల ఊహలకు భిన్నంగా ముగించారు. తెలుగు సినిమాల్లో ఉండే బలమైన సెంటిమెంట్‌ను అది బ్రేక్‌ చేస్తుందా?లేదా?అన్నది చూడాల్సిందే.

పర్ఫార్మెన్స్‌

కథకుడిగా, సంభాషణల రచయితగా దేవా కట్టా ప్రతిభను చాటుకున్నారు. గాంధీని, హిట్లర్‌ను నాయకులు చేసింది ప్రజలే..అజ్ఞానం గూడు కట్టిన చోటే మోసం గుడ్లు పెడుతుంది..లాంటి సంభాషణలు ఆలోచనను రేకెత్తిస్తాయి. సమాజానికి మంచి చెప్పాలనే తపన ఆయన రాసిన ప్రతి డైలాగ్‌లోనూ కనిపించింది. రొమాంటిక్‌, కామెడీ ట్రాక్‌, లవ్‌ సీన్స్‌ లేకుండా నిజాయితీగా కథను తెరపై ఆవిష్కరించారు. కమర్షియల్‌ హంగులు లేకపోవడం మైనస్‌గా మారింది.


ప్రజలకు మంచి చేయాలని తపించే యువ కలెక్టర్‌ అభిరామ్‌గా సాయిధరమ్‌తేజ్‌ నటన బాగుంది. అల్లరి ప్రేమికుడిగా తన కామెడీ టైమింగ్‌తో పలు సినిమాల్లో ఆకట్టుకున్న అతడు ఇందులో మాత్రం పూర్తి భిన్నంగా కనిపించారు. ఆద్యంతం ఎమోషన్స్‌తో సీరియస్‌గా దర్శకుడు సాయితేజ్‌ను చూపించారు. డైలాగ్‌ డెలివరీలో వైవిధ్యతను కనబరిచాడు. విశాఖవాణిగా ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో రమ్యకృష్ణ పాత్ర శక్తివంతంగా సాగింది. కొన్ని చోట్ల నరసింహాలోని నీలాంబరిని పాత్రను ఆమె గుర్తుతెచ్చింది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అవినీతిపరుడిగా మారిన ప్రభుత్వ ఉద్యోగిగా జగపతిబాబు విలక్షణ నటనను కనబరిచారు. ఐశ్వర్యరాజేష్‌ సహజ అభినయాన్ని కనబరిచింది.
సందేశాత్మక కథాంశానికి మణిశర్మ సంగీతం చక్కగా కుదిరింది. జానపదశైలిలో ప్రతి పాటను వినూత్నంగా కంపోజ్‌ చేశారు. సుకుమార్‌ ఛాయాగ్రహణం బాగుంది.


మూడు పాటలు, ఆరు ఫైట్స్‌ లాంటి రెగ్యులర్‌ కమర్షియల్‌ ఫార్ములాకు భిన్నంగా సాగే చిత్రమిది. సమకాలీన రాజకీయాల్లో ఉన్న లోపాల్ని ఎత్తిచూపుతూ చక్కటి సందేశంతో దేవా కట్టా ఈ సినిమాను తెరకెక్కించారు. మౌత్‌టాక్‌పైనే ఇలాంటి సినిమాల జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. ‘రిపబ్లిక్‌’ మంచి సినిమాగా విమర్శకుల ప్రశంసల్ని అందుకోవడం మాత్రం ఖాయం.

రేటింగ్‌-2.75/5

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Republic: అనేక ఛాలెంజెస్ న‌డుమ 64 రోజుల్లో రిప‌బ్లిక్ షూటింగ్ పూర్తి- మేకింగ్ వీడియో

Pawan Kalyan | ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌సంగంతో చిరంజీవి అప్ సెట్ అయ్యాడా..?

రిపబ్లిక్‌ మూవీ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన డైరెక్టర్‌

సాయి ధ‌రమ్ తేజ్ ఆరోగ్యంపై అభిమానుల్లో టెన్ష‌న్.. అప్‌డేట్ ఇచ్చిన థ‌మన్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement