శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 09, 2020 , 22:32:11

ఇటలీ జ్ఞాపకాల్లో..

ఇటలీ జ్ఞాపకాల్లో..

రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రెడ్‌'. కిశోర్‌ తిరుమల దర్శకుడు. నివేదా పేతురాజ్‌, మాళవికాశర్మ కథానాయికలు. ఏప్రిల్‌ 9న విడుదలకావాల్సిన ఈ సినిమా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాలోని రెండు పాటల్ని  ఫిబ్రవరి నెలలో ఇటలీలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఇటలీ కరోనా మహమ్మారితో అల్లాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం లేకముందు ఇటలీలో షూటింగ్‌ తాలూకు జ్ఞాపకాల్ని చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్‌ పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ ‘ఇటలీలోని సుందరమైన డోలమైట్స్‌ ప్రాంతంలో పాటల్ని చిత్రీకరించాం. అక్కడ షూటింగ్‌ జరుపుకున్న తొలి తెలుగు సినిమా ‘రెడ్‌'. అక్కడి అందమైన ప్రాంతాలైన టుస్కాన్‌, ఫ్లారెన్స్‌, డోలమైట్స్‌లో నాయకానాయికలపై రెండు పాటల్ని చిత్రీకరించాం. లేక్‌గార్డెన్‌, డోలమైట్‌ నుంచి తిరిగొచ్చిన ఆరు రోజులకు అక్కడకు బ్రిటీష్‌ స్కైటీమ్‌ వెళ్లింది. వారిలో 17మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ప్రకృతి అందాలకు నెలవైన ఆ ప్రాంతంలో కరోనా వ్యాప్తి చెందడం బాధగా అనిపించింది. వారం రోజుల ముందే అక్కడి నుంచి వచ్చిన మా టీమ్‌ సురక్షితంగా ఉంది. ప్రస్తుతం ఇటలీలో పరిస్థితుల్ని చూసి మా టీమ్‌ కలవరపడుతోంది. అక్కడి షూటింగ్‌ జ్ఞాపకాలు మరచిపోలేనివి. ప్రపంచమంతా కరోనా బారి నుంచి బయటపడాలని కోరుకుంటున్నా. పరిస్థితులన్నీ సద్దుమణిగాక ‘రెడ్‌' సినిమా విడుదల తేదీ గురించి ప్రకటిస్తాం’ అన్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిస్తున్న ‘రెడ్‌' చిత్రానికి సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, సంగీతం: మణిశర్మ.


logo