శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 23, 2020 , 22:41:29

మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన రష్మిక మందన్న..

మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన రష్మిక మందన్న..

ఇప్పటికే సౌత్ లో నెంబర్ వన్ పీఠం కోసం పావులు కదుపుతుంది రష్మిక మందన్న. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా ఆమె వరస అవకాశాలు అందుకుంటుంది. తెలుగులో అయితే ప్రస్తుతం పూజా హెగ్డేతో అగ్రపీఠం కోసం ప్రయత్నం చేస్తుంది రష్మిక. ఇక్కడ ఆమెకు వరస అవకాశాలు వస్తున్నాయి. అందుకే మకాం కూడా బెంగళూర్ నుంచి హైదరాబాద్ మార్చేసింది రష్మిక. హైదరాబాద్ లోని ఓ కాస్ట్ లీ ఏరియాలో ఇల్లు కూడా తీసుకుందని ప్రచారం జరుగుతుంది. దర్శక నిర్మాతలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది రష్మిక. సరిలేరు నీకెవ్వరు, భీష్మ లాంటి వరస విజయాల తర్వాత రష్మికతో నటించడానికి స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. 

తెలుగులో ప్రస్తుతం ఈమె పుష్పతో పాటు ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమాలు చేస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా మంచి క్రేజ్ తోనే వస్తున్నాయి. ముఖ్యంగా పుష్పతో అమ్మడి జాతకం మారిపోవడం ఖాయం. ఇది కానీ హిట్ అయిందంటే నెంబర్ వన్ అవుతుంది రష్మిక మందన్న. దాంతో పాటు కన్నడలో కూడా వరస సినిమాలు చేస్తుంది. సొంత ఇండస్ట్రీ రష్మికను నెత్తిన పెట్టుకుంది. ప్రస్తుతం అక్కడ ధృవ సర్జతో పొగరు సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటు మరో రెండు మూడు ప్రాజెక్టులు కూడా ఆమె చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు తమిళనాట మరో బంపర్ ఆఫర్ రష్మికను వరించినట్లు తెలుస్తుంది. 

ఇప్పటికే అక్కడ కార్తితో సుల్తాన్ సినిమాలో నటిస్తుంది రష్మిక. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ఇప్పుడు సూర్యతోనూ రొమాన్స్ చేసే అవకాశం వచ్చిందని తెలుస్తుంది. నిజానికి ఈయనతో గతంలోనే నటించాల్సి ఉన్నా కూడా అవకాశం చేజారిపోయింది. త్వరలోనే పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు సూర్య. రష్మికను ఇందులో హీరోయిన్‌గా తీసుకుంటున్నారు. కార్తితో నటించిన హీరోయిన్లకు సూర్యతో కూడా ఆఫర్ వస్తుంది.. అలాగే సూర్యతో నటిస్తే కార్తి ఛాన్సిస్తుంటాడు. ఇప్పుడు రష్మిక విషయంలోనూ ఇదే జరుగుతుంది. కార్తి సుల్తాన్ తర్వాత సూర్యతో రొమాన్స్ చేయబోతుంది రష్మిక మందన్న. మరి ఈ అవకాశం రష్మిక రేంజ్ ను ఎంతవరకు పెంచుతుందో చూడాలి.