బుధవారం 03 జూన్ 2020
Cinema - May 18, 2020 , 22:47:43

జామకాయలు దొంగిలించా!

జామకాయలు దొంగిలించా!

‘ఎప్పుడూ సినిమా సంగతులేనా? మిగతా విషయాలు మాట్లాడుదాం. నా పర్సనల్‌లైఫ్‌ గురించి తెలియని విషయాల్ని మీతో షేర్‌ చేసుకోవాలని ఉంది. మీరు ఏ ప్రశ్నలైనా అడగొచ్చు’ అంటూ సోషల్‌మీడియాలో తన అభిమానులకు బంపర్‌ ఆఫరిచ్చింది కన్నడ సోయగం రష్మిక మందన్న. దీంతో అభిమానులు ఆమె వ్యక్తిగత సంగతుల గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. మీ అందమైన చిరునవ్వు వెనక కారణమేమిటని ఓ అభిమాని అడగ్గా..ఓ కుక్కపిల్ల తాలూకు బొమ్మను షేర్‌ చేస్తూ ‘పెట్స్‌ నుంచి నేను పొందే ప్రేమే నా చిరునవ్వుకు కారణం’ అని చెప్పింది. 

ఈ లాక్‌డౌన్‌ సమయంలో వంట చేయడం బాగా నేర్చుకున్నానని, బర్త్‌డే కేక్‌ కావాలంటే ఎవరైనా తనకు ఆర్డర్‌ ఇవ్వొచ్చని చెప్పింది. చిన్నతనంలో బాగా గుర్తుండిపోయిన జాపకం ఏంటని అడిగితే ‘చిన్నప్పుడు జామకాయలు దొంగతనం చేశా. నా స్నేహితురాలితో కలిసి స్కూల్‌కు వెళ్లొస్తుండగా మధ్యలో జామకాయల చెట్టు కనిపించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొన్ని పండ్లు తెంపాను. అక్కడున్న ఒక ఆవిడ కర్ర పట్టుకొని మమ్మలి వెంబడించింది. ప్రతి ఒక్కరి బాల్యంలో ఇలాంటి సంఘటన తప్పకుండా ఒకటుంటుంది’ అని చెప్పుకొచ్చింది. తాను తొలిసారి థియేటర్‌లో ‘గిల్లీ’ అనే సినిమా చూశానని, నాన్నతో కలిసి ఆ సినిమాకు వెళ్లిన రోజు ఇంకా గుర్తుందని తెలిపింది. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో అల్లు అర్జున్‌ సరసన ‘పుష్ప’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.


logo