గురువారం 09 జూలై 2020
Cinema - Feb 14, 2020 , 22:51:55

వాస్తవ ఘటనల ‘అరణ్య’

వాస్తవ ఘటనల ‘అరణ్య’

‘రెండున్నరేళ్ల కష్టానికి ప్రతిఫలమిది. పద్మశ్రీ అవార్డు పొందిన జాదవ్‌ ప్రియాంక్‌ అనే వ్యక్తి జీవితం స్ఫూర్తితో అస్సాంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా  సినిమాను రూపొందించాం’ అని అన్నారు రానా. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అరణ్య’. ప్రభు సాల్మన్‌ దర్శకుడు. విష్ణువిశాల్‌ కీలక పాత్రధారి. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మిస్తున్నది. ఈ చిత్ర టీజర్‌ను గురువారం హైదరాబాద్‌లో చిత్రబృందం విడుదలచేసింది. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ ‘ఈ సినిమాతో జీవితం అంటే ఏమిటో తెలిసింది. కథ విని క్యారెక్టర్‌ను అర్థం చేసుకోవడానికి నాకు ఆరు నెలలు సమయం పట్టింది.  పర్యావరణంలో మనం ఒక భాగం అని చాటిచెప్పే సినిమా ఇది. 


మూడు భాషల్లో ఒకేసారి చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది’ అని తెలిపారు. సురేష్‌బాబు మాట్లాడుతూ ‘సమాజానికి ఉపయుక్తమైన చిత్రమిది. ప్రకృతిని ఎలా కాపాడుకోవాలనే విషయాన్ని కమర్షియల్‌ పంథాలో అర్థవంతంగా  దర్శకుడు ప్రభుసాల్మన్‌ తెరపై ఆవిష్కరించారు’ అని అన్నారు. ‘తెలుగుతో పాటు తమిళంలో ‘కాండన్‌', హిందీలో ‘హాథీ మేరే సాథి’ పేరుతో ఒకేసారి ఈ సినిమాను రూపొందిస్తున్నాం. అరణ్య పాత్ర కోసం  రానా తనను తాను మలచుకున్న తీరు కొత్తగా ఉంటుంది.  ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుంది’ అని దర్శకుడు చెప్పారు.  ఏప్రిల్‌ 2న ఈ సినిమాను విడుదలచేయనున్నట్లు ఈరోస్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. logo