శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 22, 2020 , 11:31:26

గ‌ర్జించిన కొమురం భీం.. ఎన్టీఆర్ లుక్‌ చూసి అభిమానులు ఫిధా‌

గ‌ర్జించిన కొమురం భీం.. ఎన్టీఆర్ లుక్‌ చూసి అభిమానులు ఫిధా‌

బాహుబ‌లి సినిమాతో చ‌రిత్ర‌ సృష్టించిన రాజ‌మౌళి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఎన్టీఆర్,  రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న రౌద్రం ర‌ణం రుధిరం అనే చిత్రం చ‌రిత్ర, ఫిక్షన్‌ అంశాల కలబోత ఆధారంగా రూపొందుతుంది. తెలంగాణ వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా  రామ్‌చరణ్ నటిస్తోన్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ కీలకపాత్రలు పోషిస్తున్నారు. 

వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్న ఈ చిత్ర షూటింగ్ మార్చి నుండి క‌రోనా వ‌ల‌న ఆగిపోయింది. రీసెంట్‌గా తిరిగి షూటింగ్ ప్రారంభించారు. అయితే చిత్రంలో అల్లూరి సీతారామ‌రాజుగా న‌టిస్తున్న చ‌ర‌ణ్‌కు సంబంధించిన వీడియోని ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌ల చేసిన రాజ‌మౌళి.. ఎన్టీఆర్ బ‌ర్త్‌డేకు విడుద‌ల చేయ‌లేక‌పోయాడు. కాక‌పోతే లేట్ అయిన‌ప్ప‌టికీ అభిమానుల అంచ‌నాలను మించేలా స‌ర్‌ప్రైజ్ ఉంటుంద‌ని హామీ ఇవ్వ‌డంతో అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు.

తాజాగా రామ‌రాజు వాయిస్‌తో భీంకు సంబంధించిన వీడియోని విడుద‌ల చేశారు. ఇందులో ఎన్టీఆర్ లుక్ అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా చేస్తుంది. రామ్ చ‌ర‌ణ్ వాయిస్‌తో ప్రారంభ‌మైన వీడియోలో..  వాడు క‌న‌బ‌డితే స‌ముద్రాలు త‌డ‌బ‌డ‌తాయి, నిల‌బ‌డితే సామ్రాజ్య‌లు సాగిల‌ప‌డ‌తాయి, వాడి పొగ‌రు ఎగిరే జెండా, వాడి ధైర్యం చీక‌ట్ల‌ను చీల్చే మండుటెండ‌, వాడు భూత‌ల్లి చ‌నుబాలు తాగిన మ‌న్నెం ముద్దు బిడ్డ‌, నా త‌మ్ముడు గోండు బెబ్బులి కొమురం భీం అంటూ ఎన్టీఆర్ పాత్ర‌ల తీరుతెన్నుల‌ని ప‌రిచ‌యం చేశారు.

దాదాపు రెండేళ్ళ త‌ర్వాత తమ అభిమాన హీరో సినిమాకు సంబంధించి వ‌చ్చిన ఈ వీడియో రికార్డుల మోత మోగించ‌డం ఖాయం అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాల్పనిక స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను రెడీ చేయ‌గా, ఈ సినిమా బాహుబ‌లిని మించిన విజ‌యం సాధిస్తుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.