తెలంగాణ సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన రాజమౌళి

కరోనా ప్రభావంతో సంక్షోభంలో కూరుకుపోయిన సినీరంగానికి చేయూతనందించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం రోజు వరాల జల్లు కురిపించారు. యాజమాన్యాలు నిర్ణయించుకొని థియేటర్స్ తెరచుకోవచ్చని పిలుపునిచ్చారు. అలానే చిత్రసీమపై ఆధారపడి వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని..దేశంలోనే తెలుగు సినీరంగాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం తెలిపారు. చిన్న సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ రీయింబర్స్మెంట్, సినిమా థియేటర్లకు విద్యుత్ కనీస డిమాండ్ ఛార్జీల రద్దు చేస్తున్నట్టు కూడా పేర్కొన్నారు.
సీఎం అందించిన తీపి కబురుతో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన చాలా ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా తెలుగు సినిమా పరిశ్రమ స్థాయిని బాహుబలితో పెంచిన రాజమౌళి.. తెలంగాణ సీఎం కెసిఆర్ గారు ప్రకటించిన సహాయక చర్యలతో తెలుగు చిత్ర పరిశ్రమ ఆనందిస్తోంది. మీ సాయంతో పరిశ్రమ మళ్ళీ పునర్వైభవాన్ని పొందుతుంది. ధన్యవాదాలు సర్ అని తన ట్వీట్లో పేర్కొన్నారు జక్కన్న.
తెలుగు చిత్ర పరిశ్రమ కోసం ప్రభుత్వం ఇటువంటి సహాయక చర్యలను తీసుకొస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము, ఈ కీలకమైన కాలంలో మీరు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది . గౌరవనీయ తెలంగాణ సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు అని పూరీ ట్వీట్ చేశారు. ఛార్మి కూడా సీఎం నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేసింది.