ఆదివారం 17 జనవరి 2021
Cinema - Nov 30, 2020 , 22:03:36

ఇంక ప్రభాస్‌తో చేయలేను వదిలేయండి అంటున్న రాజమౌళి

ఇంక ప్రభాస్‌తో చేయలేను వదిలేయండి అంటున్న రాజమౌళి

హైద‌రాబాద్ : ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి.. వాళ్లు కలిసి సినిమా చేస్తున్నపుడు ఉండే అంచనాలు కూడా మరో స్థాయిలో ఉంటాయి. అలాంటి ఓ సెన్సేషనల్ కాంబినేషన్ ప్రభాస్, రాజమౌళి. 15 ఏళ్ల కింద ఛత్రపతితో మొదలైంది ఈ కాంబో. ఆ తర్వాత బాహుబలి 1,2 లతో ప్రపంచ వ్యాప్తంగా ఈ జోడీకి పేరొచ్చింది. అన్ని భాషల్లోనూ ఇప్పుడు ప్రభాస్, రాజమౌళి సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. తమ స్థాయి పెంచుకోవడమే కాదు ఇండియన్ సినిమా స్థాయిని కూడా పెంచేసారు ఈ ఇద్దరూ. బాహుబలి అయితే ఏకంగా రూ. 2500 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో మల్టీస్టారర్ చేస్తున్నాడు దర్శకధీరుడు. 

ఈ క్రమంలోనే ప్రభాస్ తో మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తారంటూ అభిమానులు కొందరు రాజమౌళిని అడిగారు. దానికి జక్కన నుంచి ఊహించని సమాధానం వచ్చింది. వామ్మో.. మళ్లీ ప్రభాస్ తో సినిమానా.. ఇప్పటికే చాలా టైమ్ గడిపాను.. బాహుబలి కోసమే ఐదేళ్లు కలిసున్నాం.. ఇంక చాలు అంటూ నవ్వేసాడు. ప్రభాస్‌తో ఇప్పటికే చాలా చేసాను. మిగిలిన వాళ్లను చూసుకుందాం ఇప్పుడు అనేసాడు జక్కన్న. బాహుబలి తీసుకొచ్చిన ఇమేజ్‌తో ప్రభాస్ ప్రస్తుతం వరసగా ప్యాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడు. రాధే శ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమా, ప్రశాంత్ నీల్ అలా వెళ్తున్నాడు ప్రభాస్. 

ఈ క్రమంలో రాజమౌళి సినిమా అంటే రాబోయే ఐదారేళ్లలో కూడా కష్టమే. ఇదే విషయం రాజమౌళి కూడా మరోలా చెప్పాడు. అయితే ప్రభాస్‌తో ఎప్పుడు సినిమా చేయడానికైనా సిద్ధంగానే ఉంటానని.. కథ కుదిర్తే కలిసి చేస్తామని ప్రకటించాడు రాజమౌళి. అయితే ఇప్పట్లో ఆ కథ కుదరడం మాత్రం అసాధ్యమే. ఎందుకంటే రాజమౌళికి కూడా చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు సినిమా అయితే కొన్నేళ్లుగా పెండింగ్ లోనే ఉంది. ఇద్దరూ ఫ్రీ అయిన తర్వాత ఈ సినిమా చేస్తారేమో మరి. ఆ లోపు ప్రభాస్ కోసం కథ సిద్ధం అవుతుందో లేదో..?