కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’. శ్రీ సరిపల్లి దర్శకుడు. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై 88 రామారెడ్డి నిర్మిస్తున్నారు. తాన్యా రవిచంద్రన్ కథానాయిక. సోమవారం హీరో కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా సినిమాలోని థీమ్సాంగ్ను విడుదల చేశారు. ‘రాజాగారు బయటకొస్తే ప్రమాదమే ప్రయాసతో పరారు అంతే…రాజాగారు వేటకొస్తే భుజాలపై షికారులే ఖరారు అంతే..’ అనే పల్లవితో సాగే ఈ పాటకు ప్రశాంత్ ఆర్ విహారి స్వరాల్ని సమకూర్చగా, కృష్ణకాంత్ గీత రచన చేశారు. డేవిడ్ సైమన్ ఆలపించారు. ‘హీరోహీరోయిన్లతో పాటు చిత్ర ప్రధాన తారాగణంపై హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ పాటను చిత్రీకరించాం. షూటింగ్ పూర్తయింది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని నిర్మాత తెలిపారు. సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ల భరణి, పశుపతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.సి.మౌళి, సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి, దర్శకత్వం: శ్రీ సరిపల్లి.