‘ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే మంచి సినిమా ఇది. నాతో పాటు సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క పాత్రధారికి మంచి పేరుతెచ్చిపెడుతున్నది’ అని అన్నారు శ్రీవిష్ణు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘రాజరాజ చోర’. హసిత్ గోలి దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. శుక్రవారం హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుకను నిర్వహించారు. శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘సినిమాల పట్ల ఇష్టం, తపన ఉన్న టీమ్‌తో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. సొంత సినిమా అనే భావనతో ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. రవిబాబు, గంగవ్వ పాత్రలు ఈ సినిమాకు నిజమైన హీరోలుగా నిలిచాయి. భవిష్యత్తులో ఇలాంటి కథాబలమున్న మంచి సినిమాల్నే ఎంచుకుంటూ ముందుకు సాగుతాను’ అని తెలిపారు. ‘క్లిష్ట పరిస్థితుల్లో తెలుగు ప్రేక్షకులు మా సినిమాను ఆదరించడం ఆనందంగా ఉంది. రెండో వారంలో స్క్రీన్స్ పెరుగుతున్నాయి’ అని దర్శకుడు అన్నారు. ప్రేక్షకుల్ని అలరించే నవ్యమైన ఎంటర్టైనర్గా ఈ సినిమా నిలుస్తుందని నమ్మామని, ఆ నమ్మకం నిజమవ్వడం ఆనందంగా ఉందని వివేక్ కూచిభొట్ల తెలిపారు.