గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Oct 13, 2020 , 12:41:19

మీ నాన్న‌ని క్ష‌మించిన వాళ్ళు మొగుడ్ని క్ష‌మించ‌లేరా: పూరీ

మీ నాన్న‌ని క్ష‌మించిన వాళ్ళు మొగుడ్ని క్ష‌మించ‌లేరా: పూరీ

పెళ్లైన ఆడ‌వాళ్లంద‌రికి ఓ విన్న‌పం. జీవితంలో ప‌ర్‌ఫెక్ట్ తండ్రి, ప‌ర్‌ఫెక్ట్ త‌ల్లి, ప‌ర్‌ఫెక్ట్ డ్రైవ‌ర్, ప‌ర్‌ఫెక్ట్  నర్సు ఉండొచ్చేమో కాని ప‌ర్‌ఫెక్ట్ భ‌ర్త ఎక్క‌డ ఉండ‌డు. ఇదొక భ్ర‌మ‌. నా మొగుడ‌కి ఇలాంటి  క్వాలిటీసే ఉండాలి. ఇలాంటి క్యారెక్టరే ఉండాలి అని పెద్ద లిస్ట్ రాసుకుంటే అన్ని ప్రాబ్ల‌మ్స్‌లో ప‌డిపోతారు. మొగుడ్ని అంచ‌నా వేయ‌లేం.అందుకే పెళ్ళైన ప్ర‌తి ఆడది ఏదో ఒక స‌మ‌యంలో క‌న్నీళ్ళు పెట్టాల్సిందే, త‌ప్ప‌దు. లైఫ్‌లో మిమ్మ‌ల్ని చాలా మంది చాలా సార్లు ఏడిపిస్తారు. ఎక్కువ‌గా ఏడిపించేది ఒక్క మొగుడు మాత్ర‌మే. ఎందుకంటే మీ ప‌క్క‌నే ఉంటాడు, ప‌క్క‌లోనే ఉంటాడు. చెప్పకుండా కొన్ని చేస్తాడు. చెప్పి కొన్ని చేస్తాడు, సీక్రెట్‌గా మ‌రెన్నో చేస్తాడు. అందుకే మీకు కాలుద్ది. త‌ప్పు లేదు. ఇవే త‌ప్పులు మీ నాన్న కూడా చేస్తాడు. మీ నాన్న వ‌ల‌న మీ అమ్మ ఎన్ని సార్లు ఏడ్చిందో గుర్తు తెచ్చుకోండి. మీరు మీ నాన్న‌ను   క్ష‌మించ‌లేదా?  వాళ్ళ‌ను క్ష‌మించిన‌ట్టే, మొగుడిని క్ష‌మించండి. మీ కంట్లో క‌న్నీరు చూడ‌క‌పోతే ప‌క్కింటి వ‌దిన గారికి అస్స‌లు న‌చ్చ‌దు. వాళ్ళ మాట‌లు విని అన‌వ‌స‌రంగా మొగుడితో గొడ‌వ ప‌డొద్దు. ఆమె మొగుడు ఏమ‌న్నా శ్రీరామ చంద్రుడా? అంద‌రి క‌న్నా ఎక్కువ‌గా ఏడ్చింది రాముడి పెళ్లామే.

మొగుడు ఎంత గొప్పోడు అయితే భార్య‌కు అన్నీ క‌న్నీళ్ళు వ‌స్తాయి. ప్ర‌తి దేవుడు వాళ్ళ భార్య‌ని ఏడ్పించిన వాళ్ళే. పెళ్ళాం కంట త‌డిపెట్టించ‌ని  ఒక్క దేవుడి పేరు చెప్పండి. మొగుడి వ‌ల‌న కొంత ఏడిస్తే, వేరే ఆడ‌దాని వ‌ల‌న ఇంకొంత ఏడుస్తారు. మీకు ఏడ‌వడం వ‌చ్చని తెలిస్తే,అంద‌రు మిమ్మ‌ల్ని ఏడిపిస్తారు. అందుకే మీరు సుఖంగా ఉన్న‌ట్టు ఏ పిన్ని గారికి అస్స‌లు చెప్పొద్దు. క‌నిపిస్తే కష్టాలు చెప్పండి. హ‌మ్మ‌య్య‌, దీని జీవితం కూడా నాలానే ఉంద‌ని హ్యాపీగా వెళ్తది.

ఇక త‌ప్పులు చేసే మొగుడ్ని మీ అన్న‌య్య‌, త‌మ్ముడు, నాన్న‌నో అనుకొని వ‌దిలేయండి. జీవితంలో ఆ మాత్రం ఏడుపులు మొగుడు లేక‌పోయిన కూడా ఉంటాయి. మ‌మ్మ‌ల్ని కాద‌ని సాక్షాత్తు భ‌గ‌వంతుణ్ణి పెళ్ళి చేసుకుంటే టైంకు ఇంటికి రాడు, ముల్లోకాలు తిరుగుతుంటాడు. ఎవ‌రికి ఏ క‌ష్టం వ‌చ్చిన పారిపోతాడు. మీకు బీపీ వ‌స్త‌ది. నాకెందుకు రా ఈ క‌ర్మ‌. నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావ్, సినిమా లేదు స‌రదా లేదని ఫీలై ఏడుస్తారు. కాబ‌ట్టి ఎంతోకొంత‌ మేమే బెట‌ర్. మాతోనే కాపురాలు గుట్టుగా కానిచ్చేయండి. ఏవండి మేం మ‌గాళ్ళం.అమ్మ‌లు అనుక‌నేంత మంచోళ్ళం కాదు., పెళ్లాలు అనుకునేంత దుర్మార్గులం కాదు. ఏదో మ‌ధ్య‌లో ఏడుస్తుంటాం. ద‌య చేసి అర్దం చేసుకోండి. ఇక్క‌డ ప‌ర్‌ఫెక్ట్ భ‌ర్త కాని ప‌ర్‌ఫెక్ట్ భార్య కాని ఎవ‌రు ఉండ‌రు. పెళ్లంటేనే అడ్జెస్ట్‌మెంట్ ఆఫ్ ఇండియా.. అంతే అంటూ పూరీ మ్యూజింగ్స్‌లో ప‌ర్‌ఫెక్ట్ భ‌ర్త గురించి చెప్పుకొచ్చారు డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్
logo