e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home ఇంటర్వూ ట్రెండ్‌లో లేకపోతే పట్టించుకోరు!

ట్రెండ్‌లో లేకపోతే పట్టించుకోరు!

ట్రెండ్‌లో లేకపోతే పట్టించుకోరు!

‘కాస్ట్యూమ్‌ డ్రామా, మైథాలజీ చిత్రాలను తెరకెక్కించడానికి మంచి సమయమిది. ఆధునిక సాంకేతికత పెరిగిన తర్వాత ఇలాంటి కథల్ని రూపొందించడం సులభమైంది. ప్రేక్షకుల్ని ఆనాటికాలంలోకి తీసుకెళ్లే వీలు కలుగుతోంది’ అని అన్నారు గుణశేఖర్‌. దర్శకుడిగా ఒకే ఒరవడికి పరిమితం కాకుండా
విభిన్నమైన ఇతివృత్తాలతో సినిమాల్ని తెరకెక్కిస్తూ వైవిధ్యతను చాటుకుంటున్నారాయన.
చూడాలని ఉంది, ఒక్కడు, రుద్రమదేవి వంటి చిత్రాలతో అద్వితీయ విజయాల్ని అందుకున్నారు.
నేడు గుణశేఖర్‌ జన్మదినం. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో ఆయన పంచుకున్న ముచ్చట్లివి…

‘హిరణ్యకశ్యప’ సినిమా కోసం చాలా ఏళ్లు పనిచేశారు? అయినా ఆ సినిమా సెట్స్‌పైకి రాలేదెందుకని?
‘రుద్రమదేవి’ తర్వాత కెరీర్‌లో ఐదేళ్లు గ్యాప్‌ వచ్చింది. ఈ విరామంలో నా సినిమాలు విడుదలకాకపోయినా నేను మాత్రం కథలు రాయడం, ప్రీప్రొడక్షన్‌ పనులతో బిజీగా ఉన్నా. పురాణాల్లోని శక్తివంతమైన పాత్రధారి హిరణ్యకశ్యపుడి కథను ఏడాది శ్రమించి సిద్ధం చేశా. ఈ సినిమా కోసం హాలీవుడ్‌ సాంకేతిక నిపుణులతో కలిసి మూడేళ్లు ప్రీప్రొడక్షన్‌ పనుల్ని పూర్తిచేశాం. స్టోరీబోర్డ్‌తో పాటు యానిమేషన్‌ రూపంలో ప్రీవిజువలైజేషన్‌ పూర్తిచేసి షూటింగ్‌ మొదలుపెట్టే తరుణంలో కరోనా మహమ్మారి కారణంగా సినిమాను కొంతకాలం వాయిదా వేయాల్సివచ్చింది. ‘శాకుంతలం’ తర్వాత ఆ సినిమాను మొదలుపెడతాం.


సమంతతో చేయబోతున్న శకుంతల ప్రణయగాథ ఎలా ఉండబోతుంది?
‘హిరణ్యకశ్యప’ను మొదలుపెట్టడానికి సమయం ఉండటంతో ఈ విరామాన్ని వృథా చేయకూడదనే మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రణయగాథను వెండితెరపై ఆవిష్కరించాలని నిర్ణయించుకున్నా. మహాకవి కాళిదాసు రాసిన నాటకాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడున్న సాంకేతికత ఆధారంగా స్క్రీన్‌ప్లేను సిద్ధం చేశా. అదే సమయంలో
ఆర్ట్‌ అండ్‌ విజువల్‌కల్చర్స్‌లో మాస్టర్స్‌ చేసిన నా కూతురు నీలిమ నిర్మాతగా మారే ఆలోచనతో నేను సిద్ధంచేసిన కథల్ని విన్నది. తనకు ‘శాకుంతలం’ కథ నచ్చింది. ఆధునిక భావాలున్న తాను ఇలాంటి పౌరాణిక కథను ఎంచుకోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. అదే మాట తనతో చెబితే నేటి తరానికి పురాణాల ఔన్నత్యం తెలియాల్సిన అవసరం ఉందని, రోమియోజూలియట్‌ను మించిపోయే ప్రేమకథ అవుతుందని నీలిమ సమాధానమిచ్చింది. కూతురు చెప్పిన మాటలు నాలో స్ఫూర్తిని నింపాయి.

శకుంతల పాత్ర కోసం సమంతను తీసుకోవడానికి కారణమేమిటి?
కావ్యనాయిక అయిన శకుంతల పాత్ర కోసం అనేక మంది నాయికల పేర్లు పరిశీలిస్తున్న తరుణంలో నా కూతురు నీలిమ…సమంత పేరును సూచించింది. ‘రంగస్థలం’ సినిమాలో పల్లెటూరి యువతిగా సమంత అద్వితీయ అభినయాన్ని కనబరిచింది. పాత్రకు న్యాయం చేయడానికి ఎలాంటి ఎఫర్ట్స్‌ అయినా ఆమె పెడుతుంది. కథ వినగానే సమంత ఈ సినిమా చేస్తానని చెప్పింది. అంతేకాకుండా పాత్రకు అవసరమైన క్లాసికల్‌ లుక్‌ కోసం ఫిట్‌నెస్‌లో శిక్షణను తీసుకున్నది.

దుష్యంతుడి పాత్ర కోసం తెలుగు నటుల్ని కాదని మలయాళ హీరో దేవ్‌మోహన్‌ను ఎంచుకున్నారెందుకు?
ఈ కథలో దుష్యంతుడి పాత్ర కోసం స్టార్‌ హీరోను తీసుకుంటే దృష్టి మొత్తం ఆ నటుడిపైకి మళ్లుతుంది. ఈ క్యారెక్టర్‌కు స్టార్‌ ఇమేజ్‌ ఉండకూడదనే మలయాళ నటుడు దేవ్‌మోహన్‌ను తీసుకున్నాం. కొవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా పలు జాగ్రత్తలు తీసుకుంటూ తొలి షెడ్యూల్‌ తెరకెక్కించాం. యాభైశాతం చిత్రీకరణ పూర్తయింది.


ఒక సినిమా కోసం నాలుగైదేళ్ల సమయాన్ని ఎలాకేటాయించగలుగుతున్నారు?ఈ ప్రయాణంలోఎప్పుడైనా బోర్‌గా ఫీలవుతుంటారా?
సినిమా రూపకల్పనలో బోర్‌ అనేది ఎప్పుడూ ఉండదు. ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాం. నూతనోత్సాహం కనిపిస్తుంది. ఓ యజ్ఞాన్ని తలపెట్టినప్పుడు ఎంత సమయమైనా తీసుకోవాల్సిందే. ప్రీప్రొడక్షన్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ లాంటి పనుల్ని త్వరగా పూర్తిచేయడం సాధ్యం కాదు. అలాగే వృథా లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం
చాలా ముఖ్యం.

డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ వచ్చిన తర్వాత దర్శకుల ఆలోచన ధోరణి మారిందని అనుకుంటున్నారా?
ప్రస్తుతం కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌గా మారింది. స్మాల్‌స్క్రీన్‌, బిగ్‌స్క్రీన్‌ అనే భేదాలు లేకుండా మంచి కథల్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. పోటీతత్వం పెరిగింది. సినిమాల విషయంలో కొన్ని తప్పనిసరి వాణిజ్యసూత్రాలు పాటించాలి. ఓటీటీలలో ఆ పరిమితులు ఉండవు కాబట్టి నిజాయితీతో మంచికథల్ని తెరకెక్కించవచ్చు. పెద్ద స్పాన్‌ ఉన్న కథల్ని సినిమాలుగా కాకుండా వెబ్‌సిరీస్‌ రూపంలో లార్జన్‌దేన్‌లైఫ్‌గా చెప్పాలని నేను అనుకుంటున్నా.

చారిత్రక కథాంశాలతో భవిష్యత్తులో సినిమాలు చేస్తారా?
‘రుద్రమదేవి’ చిత్రానికి కొనసాగింపుగా ‘ప్రతాపరుద్ర’ సినిమా చేయాలనుకుంటున్నా. కాకతీయుల చరిత్రతో పాటు ‘రుద్రమదేవి’ సినిమాలో చూపించని గొప్ప అంశాల్ని ఇందులో ఆవిష్కృతం చేసే ఆలోచనలో ఉన్నా. ప్రతాపరుద్ర కథ సిద్ధంచేశా. నిర్మాణపరంగా కొత్త సాంకేతికత వాడి ఈ సినిమా చేస్తా.


30 ఏళ్ల సినీ ప్రయాణంలో తక్కువ సినిమాలు చేశారు కారణమేమిటి?
సుదీర్ఘ ప్రయాణంలో కేవలం పన్నెండు సినిమాల్నేతెరకెక్కించా. ఇకపై వేగాన్ని పెంచాలని అనుకుంటున్నా. గత చరిత్రను గురించి గొప్పగా చెప్పుకొనే సమయం కాదిది. ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్నామా? లేదా? అన్నదే ముఖ్యమైపోయింది. ట్రెండ్‌లో లేకపోతే మన గురించి ఎవరూ పట్టించుకోరనే వాస్తవాన్ని తెలుసుకున్నా. అందుకే వేగంగా సినిమాలు చేయాలనుకుంటున్నా.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ట్రెండ్‌లో లేకపోతే పట్టించుకోరు!

ట్రెండింగ్‌

Advertisement