గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 02, 2020 , 23:56:20

జన్మదినవేళ నాలుగింతలహేల

జన్మదినవేళ నాలుగింతలహేల

పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఆయన కొత్త సినిమాల తాలూకు కబుర్లతో అభిమానుల్లో ఆనందం నెలకొంది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న నాలుగు సినిమాలకు సంబంధించిన విశేషాల్ని చిత్రబృందాలు వెల్లడించాయి. ఈ బర్త్‌డే సర్‌ప్రైజ్‌లు పవన్‌కల్యాణ్‌అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. 

న్యాయాన్ని కాపాడే వకీల్‌గా అవతారమెత్తారు పవన్‌కల్యాణ్‌. ఆయన కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్‌ పతాకాలపై రూపొందుతున్న  చిత్రం ‘వకీల్‌సాబ్‌'. బోనీకపూర్‌ సమర్పణలో దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. శ్రీరామ్‌వేణు దర్శకుడు. బుధవారం  మోషన్‌పోస్టర్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఇందులో ఒకవైపు మహాత్మాగాంధీ ఫొటో, మరో వైపు అంబేఢ్కర్‌ ఫొటో మధ్యలో నల్లకోటుతో పవన్‌కల్యాణ్‌ కనిపిస్తున్నారు. ఓ చేతిలో బేస్‌బాల్‌ స్టిక్‌, మరో చేతిలో క్రిమినల్‌ లా పుస్తకంతో నిలబడిన ఆయన పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘లాయర్‌గా పవన్‌కల్యాణ్‌ పాత్ర శక్తివంతంగా ఉంటుంది. ఆయన నుంచి అభిమానులు కోరుకునే అన్ని హంగులుంటాయి. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత చిత్రీకరణను పునఃప్రారంభించి వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.తమన్‌, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, సహనిర్మాత: హర్షిత్‌రెడ్డి. 

విజయం కంటికి కనిపిస్తోంది

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్నది. ఏ.ఎమ్‌.రత్నం నిర్మాత. ఈ సినిమా ప్రీలుక్‌ పోస్టర్‌ను బుధవారం విడుదలచేశారు. ఈ సినిమాకు సంబంధించి పదిహేను రోజుల చిత్రీకరణ జరిపినట్లు క్రిష్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు ‘పదిహేను రోజుల షూటింగ్‌ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది. చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది’ అని క్రిష్‌ పేర్కొన్నారు.  ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా సాయిమాధవ్‌ బుర్రా సంభాషణలు సమకూర్చుతున్నారు. 

-క్రిష్‌


logo