ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Aug 01, 2020 , 23:45:49

పోలీస్‌గా నటించడం గర్వంగా వుంది: హీరో రూపేష్‌కుమార్‌ చౌదరి

పోలీస్‌గా నటించడం  గర్వంగా వుంది: హీరో రూపేష్‌కుమార్‌ చౌదరి

‘22’ సినిమా యాక్షన్‌ థ్రిల్లర్‌. ఈ నెంబర్‌ అనేది సినిమాలో ప్రధాన అంశం. కథనం అందరిలోనూ తప్పకుండా ఆసక్తిని కలిగిస్తుంది. ఈ సినిమా తప్పకుండా ప్రతి ప్రేక్షకుడికి ఒక కొత్త అనుభవాన్నిస్తుంది’ అన్నారు హీరో రూపేష్‌కుమార్‌ చౌదరి. ఆయన హీరోగా నటిస్నున్న చిత్రం‘22’. శివకుమార్‌.బి దర్శకుడిగా  పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీమతి సుశీలాదేవి నిర్మిస్తున్నారు.  కాగా నేడు రూపేష్‌ పుట్టినరోజు.  ఈ సందర్భంగా ఆయన సినిమా గురించి చెప్పిన విశేషాలివి.

మాది బిజినెస్‌ నేపథ్యమున్న కుటుంబం. సినిమాలంటే ఆసక్తితో ఫ్యామిలీని కన్వీన్స్‌చేసి ‘22’తో హీరోగా అరంగ్రేటం చేస్తున్నాను. అనీ మాస్టర్‌ ద్వారా దర్శకుడు శివకుమార్‌తో పరిచయం జరిగింది. ఇద్దరం కలిసి ఒక వెబ్‌సీరిస్‌ చేశాం. ఆ క్రమంలోనే శివకుమార్‌ చెప్పిన కథ నచ్చి ఈ సినిమా చేస్తున్నాను. కథ వినగానే పవర్‌ఫుల్‌ పోలీస్‌ఆఫీసర్‌ పాత్ర చేయగలనా అనిపించింది. ఈ పాత్ర కోసం నన్ను నేను పూర్తిగా మార్చుకున్నాను. బాహుబలి, సాహో, ఖైదీ నెంబర్‌ 150 చిత్రాలకు ఫైట్స్‌ కంపోజ్‌ చేసిన జాషువా మాస్టర్‌ నేతృత్వంలో కుంగ్‌ఫూ, మార్షల్‌ ఆర్ట్స్‌ లాంటి వాటిలో శిక్షణ తీసుకున్నాను. ఆయనే మా సినిమాలో అందరూ ఆశ్చర్యపడే అద్భుతమైన యాక్షన్‌ ఏపిసోడ్స్‌ కంపోజ్‌ చేశారు.

శివ దర్శకత్వ ప్రతిభ తెలుస్తుంది

దర్శకుడు శివకి ఇది మొదటి సినిమా అయినా ఓ అనుభవమున్న దర్శకుడిలా పూర్తి క్లారిటీతో ఈ సినిమా రూపొందించాడు. శివ టేకింగ్‌ అందర్ని ఆకట్టుకుందనే నమ్మకం వుంది. ఈ సినిమాతో దర్శకుడిగా అతని ప్రతిభ అందరికి తెలుస్తుంది.  మేకింగ్‌ విషయంలో కూడా ఎలాంటి రాజీపడకుండా నిర్మాతలు లావీష్‌గా నిర్మించారు. సాధారణంగానే నాకు పోలీస్‌ అంటే గౌరవం. ఈ చిత్రంలో నేను పోలీస్‌ఆఫీసర్‌ రుద్రగా చేస్తున్నప్పుడు ఎంతో గర్వంగా అనిపించింది.చిన్నప్పటి నుంచి నేను పోలీస్‌ఆఫీసర్‌ పాత్ర చేస్తే ఎలా వుంటుంది అని నేను ఊహించుకున్నానో దాని కంటే వెయ్యిరెట్లు ఎక్కువగా స్క్రీన్‌ మీద కనిపించాను. టెంపర్‌లో ఎన్టీఆర్‌, గబ్బర్‌సింగ్‌లో పవన్‌కల్యాణ్‌ పాత్రలను ప్రేరణగా తీసుకొని ఈ చిత్రంలో నా పాత్రను చేశాను. 

థియేటర్‌లోనే విడుదల

ఇటీవల విడుదలైన పాటకు, టీజర్‌కు మంచి స్పందన లభిస్తుంది. అయితే ఇది ఒక బిగ్‌స్క్రీన్‌ ఎంటర్‌టైనర్‌. అందుకే థియేటర్‌ రిలీజ్‌కే ఫ్రిపరెన్స్‌ ఇచ్చి ఈ కోవిడ్‌ వ్యాప్తి తగ్గి తిరిగి థియేటర్స్‌ ఓపెన్‌ చేయగానే విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం.


logo