మంగళవారం 14 జూలై 2020
Cinema - Jun 30, 2020 , 01:52:34

ఓటీటీలో లాభనష్టాల్ని అంచనా వేయలేం!

ఓటీటీలో లాభనష్టాల్ని అంచనా వేయలేం!

‘కోవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగానే నా కుమారుడు రానా పెళ్లి  జరుగుతుంది.  పరిస్థితులు సాధారణంగా ఉంటే  ఈ సమయానికే పెళ్లి పనులతో బిజీగా ఉండేవాళ్లం.  కరోనా ప్రభావం వల్ల ప్రస్తుతం పెళ్లి వేడుకకు పదిమంది హాజరైతే గొప్ప అనుకునేలా ఉంది’ అని అన్నారు సురేష్‌బాబు.  సురేష్‌ప్రొడక్షన్స్‌ ద్వారా ఆయన విడుదల చేసిన చిత్రం ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రం తాజాగా ‘ఆహా’ యాప్‌ ద్వారా జూలై 4న ప్రేక్షకుల ముందుకురాబోతున్నది. ఈ సినిమా విశేషాలతో పాటు ఓటీటీ వల్ల కలిగే లాభనష్టాల గురించి సురేష్‌బాబు  మాట్లాడుతూ ‘నేటి తరం అభిరుచులను ప్రతిబింబించే కథ ఇది. రానాకు చాలా నచ్చింది. తన స్నేహితుల జీవితాలకు దగ్గరగా ఉందని  ఆలోచనతో మొదలుపెట్టాడు. 

ఈ సినిమాను రూపొందిస్తున్నామని తెలియగానే ఇలాంటి వాటితో సమాజానికి ఏం నేర్పుతారని నా భార్య  విమర్శించింది. ప్రతి ఒక్కరూ  జీవితంలో ద్వంద్వ ప్రమాణాలతోనే బతుకుతుంటారు. కాలానుగుణంగా కొన్ని అంశాలు కొన్ని సందర్భాల్లో సమాజానికి వ్యతిరేకమైనవిగా అనిపిస్తాయి. కొన్ని సార్లు అవసరమైనవిగా ఉంటాయి. అలా  ఆలోచించే ఈ సినిమాను రూపొందించాం. ప్రతిభావంతులైన నటీనటుల కలయికలో సహజమైన అభినయంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. యువతరం అయోమయాల్ని, సంశయాల్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కించాం. సినిమా థియేటర్‌లో విడుదలైతే ఎంత కలెక్షన్‌ వచ్చింది, సినిమా సక్సెస్‌ అయ్యిందా లేదా నిర్మాతకు అవగాహన ఉంటుంది. కానీ ఓటీటీలో అయితే ఊహించడం కష్టమే. సక్సెస్‌ను ఎలా అంచనా వేయాలో తెలియదు. 

వీక్షకుల సంఖ్యను అనుసరించే జయాపజయాల్ని నిర్ణయిస్తారని అనుకుంటున్నా. ఓటీటీకి  చిన్న సినిమా, పెద్ద సినిమా  అనే భేదాలు లేవు.  లక్ష్మీబాంబ్‌, సడక్‌ పెద్ద చిత్రాలు  సైతం ఓటీటీ ద్వారానే విడుదలకానున్నాయి. సినిమాను ఓటీటీలో విడుదల చేయాలా? వద్దా? అనేది  నిర్మాత అభీష్టంపైనే ఆధారపడి ఉంటుంది.  ప్రస్తుత ప్రభుత్వ నిబంధనల ప్రకారం విరాటపర్వం, నారప్ప సినిమా చిత్రీకరణల్ని జరపడం కష్టం. వాటిలో మార్పులు చేసి కథాగమనాన్ని చెడగొట్టకూడదని అనుకుంటున్నా. అందుకే ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్‌లను ప్రారంభించే ఆలోచన లేదు. హిరణ్యకశ్యప లాంటి కొన్ని కథల్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తేనే న్యాయం జరుగుతుంది. బడ్జెట్‌ తగ్గించే ఆలోచన లేదు. అభిరామ్‌ కోసం కథలు వింటున్నాం’ అని తెలిపారు. 


logo