ఆదివారం 31 మే 2020
Cinema - May 11, 2020 , 22:56:19

కొత్తబంగారు జీవితం

కొత్తబంగారు జీవితం

కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్నానని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఆదివారం ట్విట్టర్‌ ద్వారా ప్రకటించడం అటు పరిశ్రమ వర్గాల్లోనూ ఇటు సినీ ప్రియుల్లోనూ ఆసక్తినిరేకెత్తించింది. తన రెండో పెళ్లి గురించి పరోక్షంగా ఆయన ప్రకటన చేశారని భావించారు. అందరూ ఊహించినట్లుగానే దిల్‌రాజు రెండో వివాహం చేసుకున్నారు. ఆదివారం రాత్రి నిజామాబాద్‌ జిల్లాలోని నర్సింగ్‌పల్లి వెంకటేశ్వర ఆలయంలో ఆయన తేజస్వినిని (వైఘా రెడ్డి) వివాహమాడారు. లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా వివాహానికి పరిమిత సంఖ్యలో అతిథులు హాజరయ్యారు. వరంగల్‌కు చెందిన తేజస్విని కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడ్డారని తెలిసింది. గతంలో ఆమె ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేశారని సమాచారం.

నాన్నకు శుభాకాంక్షలు..

రెండో వివాహం చేసుకున్న దిల్‌రాజుకు ఆయన కుమార్తె హన్షితా రెడ్డి శుభాకాంక్షలందజేసింది. ఈ సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేసింది. ‘మీరే నా బలం. నాకు ప్రేమను అందించినందుకు, ఎల్లప్పుడూ కుటుంబ సభ్యుల సంతోషం కోసం తపించినందుకు ధన్యవాదాలు. జీవితంలో కొత్త ప్రయాణాన్ని ఆరంభించిన మీరిద్దరు ఆనందంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నా. ప్రతిరోజు అద్భుతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా’ అని హన్షితా రెడ్డి పేర్కొంది. దిల్‌రాజు మొదటి భార్య అనిత మూడేళ్ల క్రితం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు ఆయన రెండో వివాహం చేసుకున్నారని చెబుతున్నారు. దిల్‌రాజు పెళ్లి వార్త, అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.logo