‘వింక్గర్ల్ ఇమేజ్ నుంచి బయటపడుతూ నటనకు ఆస్కారమున్న భిన్నమైన పాత్రలతో కథానాయికగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలనుంది’ అని చెప్పింది ప్రియాప్రకాష్ వారియర్. ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘ఇష్క్’. మెగాసూపర్‌గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎన్వీప్రసాద్, పారస్‌జైన్, వాకాడ అంజన్‌కుమార్ నిర్మించారు. యస్.యస్.రాజు దర్శకుడు. ఈ నెల 23న విడుదలకానుంది. ప్రియాప్రకాష్వారియర్ మాట్లాడుతూ ‘తెలుగులో నేను నటించిన రెండో స్ట్రెయిట్ సినిమా ఇది. ఇందులో ఆత్మగౌరవం, ధైర్యం కలబోతగా సాగే అనసూయ అనే కాలేజీ అమ్మాయిగా నవ్యరీతిలో నా పాత్ర ఉంటుంది. నా నిజజీవితానికి పూర్తి భిన్నంగా ఈ సినిమాలో కనిపిస్తా. గ్రామీణ నేపథ్యంతో సాధారణ జీవితాన్ని కొనసాగించే అమ్మాయిగా దర్శకుడు నా పాత్రను సరికొత్తగా తీర్చిదిద్దారు. మలయాళంలో రూపొందిన ‘ఇష్క్’ చిత్రం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మాతృకలోని నటీనటుల్ని అనుకరించకుండా నా శైలిలో స్వేచ్ఛను తీసుకుంటూ నటించా. ‘చెక్’ ఫలితాన్ని సానుకూలంగానే తీసుకున్నా. పరాజయాలు నుంచి నేర్చుకున్న పాఠాలతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కెరీర్లో ముందుకు సాగాలన్నదే నా సిద్ధాంతం. ‘చెక్’ సినిమాలో నా నటన, పాత్రకు మంచి పేరొచ్చింది. నిజజీవితంలో నేను గలగలా మాట్లాడుతా. చలాకీగా ఉంటా. తెరపై మాత్రం రియల్‌లైఫ్‌కు భిన్నమైన పాత్రలే ఎక్కువగా వరిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో సందీప్‌కిషన్‌తో ఓ సినిమా చేస్తున్నా’ అని తెలిపింది.